బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 9 డిశెంబరు 2021 (00:03 IST)

జనరల్ బిపిన్ రావత్ సతీమణి Madhulika Rawat అభాగ్యుల కోసం....

ఆర్మీ జనరల్ బిపిన్ రావత్ గురించి దేశానికి తెలుసు. కానీ హెలికాప్టర్ ప్రమాదంలో ఆయనతో పాటు మరణించిన ఆయన సతీమణి శ్రీమతి మధులికా రావత్ గురించి ఎందరో అభాగ్యులకు, అనాధలకు, రోగులకు చాలా బాగా తెలుసు. ఆమె ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు.

 
ఆర్మీ సిబ్బంది భార్యలు, పిల్లలు మరియు వారిపై ఆధారపడిన వారి సంక్షేమం కోసం ఆమె పనిచేశారు. AWWA భారతదేశంలోని అతిపెద్ద ఎన్జీవోలలో ఒకటి. మధులికా రావత్ వీర్ నారీమణులు... ఆర్మీ వితంతువులు, వికలాంగ పిల్లలకు సహాయం చేసే అనేక సంక్షేమ కార్యక్రమాలు, ప్రచారాలలో భాగంగా వున్నారు.

 
సైనికుల భార్యలకు సాధికారత కల్పించడంలో, బ్యూటీషియన్ కోర్సులతో పాటు టైలరింగ్, అల్లికలు, బ్యాగ్‌ల తయారీలో కోర్సులను అభ్యసించేలా వారిని ప్రోత్సహించడంతోపాటు వారిని ఆర్థికంగా స్వతంత్రులుగా మార్చేందుకు `కేక్‌లు- చాక్లెట్‌లు' తయారు చేయడంలో మధులికా రావత్ వెనుక వుండి ప్రోత్సహిస్తుంటారు.

 
మధూలికా రావత్ ఢిల్లీలో తన విద్యను అభ్యసించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు. సైనికుల భార్యల సంక్షేమమే కాకుండా ఆమె అనేక రకాల సామాజిక కార్యక్రమాలలో పాలుపంచుకుంటుండేవారు. క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల కోసం ఆమె ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆమె మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జమిందారుల కుటుంబానికి చెందినవారు. బిపిన్ రావత్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కృతికా రావత్- మరియు తారిణి ఉన్నారు.

 
డిసెంబర్ 8 మధ్యాహ్నం తమిళనాడులోని కూనూర్‌లో కూలిపోయిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్‌లో మధులికా రావత్, భర్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ఉన్నారు. దంపతులిద్దరూ కూనూర్‌లోని వెల్లింగ్‌టన్‌లోని డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కాలేజీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆస్పత్రికి తరలించేలోపే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.