గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 ఫిబ్రవరి 2020 (15:50 IST)

మేడారం జాతర.. సమ్మక్క-సారక్కల కథా నేపథ్యం ఏమిటో తెలుసా?

ఆదివాసీలకు, కాకతీయ రాజులకు మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంగా సమ్మక్క-సారక్క కథలు ఎన్నో ప్రచారం వున్నాయి. ఆదివాసీల నుంచి కాకతీయ రాజులు కప్పం వసూలు చేసిన దాఖలాలు లేవని చరిత్రకారులు చెప్పినప్పటికీ ఎక్కువ కథలు మాత్రం కప్పమే యుద్ధానికి కారణమైందని కథలు చెప్తున్నాయి. కొన్ని కథల్లో సమ్మక్క మరణించినట్లు వుంటే.. మరికొన్ని కథల్లో నెత్తురోడుతూ చిలుకల గుట్టవైపు వెళ్లిపోయిందని అంటారు. 
 
ఏడవ శతాబ్దంలో తమ నివాస స్థలమైన మేడారం నుంచి కోయదొరలు వేటకోసం అడవికి వెళ్లారు. అక్కడ వారికి పెద్ద పులుల కాపలా మధ్య దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఓ పసిపాప కనిపించింది. ఆ పాపను కోయదొరలు గుడారానికి తీసుకెళ్లి దాచారు. పాప గూడేనికి వచ్చినప్పటి నుంచి అన్నీ శుభాలే జరిగాయి. కొండ దేవతే తమకు పాప రూపంలో సాక్షాత్కరించిందని నమ్మి కోయదొరలు మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఆ పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు. 
 
సమ్మక్కను పెంచిన కోయ చక్రవర్తి మేడరాజు తన మేనల్లుడు పగిడిద్ద రాజుతో సమ్మక్కకు పెళ్లి జరిపించాడు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మతో పాటు జంపన్న కూడా జన్మించాడు. అయితే, మేడారం పరగణాను పాలించే కోయరాజులు ఓరుగల్లు రాజులకు సామంతులుగా ఉండేవారు. ఒక సంవత్సరం కరువు కాటకాల వల్ల కోయరాజులు కాకతీయులకు కప్పం చెల్లించలేకపోయారు. దీంతో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు సైన్యాన్ని గిరిజనులపైకి యుద్ధానికి పంపాడు. కాకతీయ సేనల ముందు గిరిజనులు నిలువలేక పోయారు. 
 
సమ్మక్క భర్త పగిడిద్దరాజుతోపాటు వారి కుమార్తెలు నాగులమ్మ, సారలమ్మ, అల్లుడు గోవిందరాజులు కూడా వీరమరణం పొందారు. పరాజయాన్ని తట్టుకోలేక జంపన్న మేడారం సమీపంలోని సంపెంగవాగులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఒక కథ. దీంతో సమ్మక్క మహోగ్రరూపిణిగా విజృంభించి కాకతీయ సేనలను అంతం చేయడం ప్రారంభించింది. స్వైర విహారం చేస్తున్న సమ్మక్కను ఒక కాకతీయ సైనికుడు దొంగచాటుగా బల్లెంతో పొడిచాడు. ఆ గాయంతోనే సమ్మక్క నెత్తురోడుతూ ఈశాన్యదిశగా ఉన్న చిలుకల గుట్టపైకి వెళ్లి అదృశ్యమైంది. 
 
ఆమెను కొందరు కోయలు అనుసరించినప్పటికీ అదృశ్యమైన సమ్మక్క జాడ తెలియలేదు. గుట్టమీద నాగవృక్షం సమీపంలో వారికి ఒక కుంకుమ భరిణె లభించింది. వారు ఆ భరిణెనే సమ్మక్కగా భావించి ఆమె కోసం చాలా రోజులు అక్కడే నిద్రాహారాలు మాని ఎదురుచూశారు. ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుంకుమ భరిణె లభించిన ప్రాంతంలోనే రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున ముత్తయిదువలు పండుగ జరుపుకునేవారు. 
 
ఈ పండుగే కాలక్రమేణా జాతరగా రూపాంతరం చెందింది. మేడారం జాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడంలో వడ్డెలదే కీలక పాత్ర. దేవతలను గద్దెలకు చేర్చడంలో అనాదిగా వస్తున్న సాంప్రదాయం. కన్నెపల్లి నుంచి సాయంత్రం సారలమ్మను మేడారంలోకి గద్దెలపైకి తీసుకొచ్చి ప్రతిష్టిస్తారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరలో సమ్మక్క కూతురైన సారలమ్మ నివాసం కన్నెపల్లిలో పూజలు జరుగుతాయి. 
 
జాతర రెండో రోజు అధికార లాంఛనాలతో సమ్మక్కకు స్వాగతం లభిస్తుంది. పోలీసు అధికారుల తుపాకీ కాల్పుల గౌరవ వందనం, ఎదురుకోళ్ల ఘట్టంతో భక్తులు సమ్మక్కను ఆహ్వానిస్తారు. గద్దెలపై ఆసీనులైన సమ్మక్క, సారలమ్మలు మూడోరోజు అశేష జనావళికి దర్శనమిస్తారు. జంపన్నవాగులో పుణ్యస్నానాల అనంతరం భక్తులు తల్లులను దర్శించుకుంటారు. కోర్కెలు తీర్చమని కోరుతూ కానుకలు, మొక్కులు సమర్పించుకుంటారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలకు దర్శనమిచ్చిన సమ్మక్క, సారలమ్మలు నాల్గోరోజున తిరిగి వనప్రవేశం చేస్తారు. దీంతో జాతర ముగిసిపోతుంది.