సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 ఫిబ్రవరి 2020 (13:42 IST)

సీఎం జగన్.. ఏసు ప్రభువుపై ఒట్టేసి చేబుతారా? చంద్రబాబు

ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో సవాల్ విసిరారు. ఈ ముఖ్యమంత్రి జగన్‌కు ఏసు ప్రభువుపై నమ్మకం ఉంటే ఇక్కడే అమరావతిని కొనసాగిస్తానని ప్రకటించాలని డిమాండ్ చేశారు. 
 
ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ, రాజధాని కోసం 39 మంది రైతులు చనిపోయారని, కానీ ఈ ముఖ్యమంత్రికి, ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణానికి డబ్బుల్లేవని జగన్‌ అసత్యాలు చెబుతున్నారని విమర్శించారు. 
 
అమరావతిని శ్మశానం అన్నారని, గత ఎనిమిది నెలలుగా శ్మశానంలో కూర్చొని పాలించారా? అని ప్రశ్నించారు. రాజధానికి వరదలు వస్తాయని వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ప్రభుత్వం అంటే నమ్మకమని, అసత్యాలు చెప్పొద్దని కోరారు. చట్టాలను ఉల్లంఘించేది ప్రభుత్వమే కాదన్నారు. రాజధాని కోసం భూములు ఇవ్వని రైతుల్ని సీఎం వద్దకు తీసుకెళ్లి.. సంఘీభావం తెలుపుతున్నారని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. 
 
అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ ఉండాలని.. అమరావతిని ప్రారంభించడం తప్పా? అని ప్రశ్నించారు. 23-4-2015లో జీవో జారీ చేసి అమరావతిపై నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. అదే విషయాన్ని మంగళవారం కేంద్రం చెప్పిందన్నారు.
 
రాజధానిని నిర్ణయించడానికి.. రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు ఉంటుందని కేంద్రం చెప్పింది కానీ.. రాజధానిని మార్చడానికి హక్కు ఉంటుందనలేదని చంద్రబాబు గుర్తుచేశారు. రాష్ట్రానికి 3 రాజధానులు పెట్టుకోమని కేంద్రం చెప్పలేదన్నారు. 
 
దేశమంతా మారుతున్నారు కానీ మన తుగ్లక్‌ (జగన్) మారడంలేదని ఎద్దేవా చేశారు. పిచ్చి నవ్వు నవ్వుతూ ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిని మార్చొద్దని అసెంబ్లీలో చేతులెత్తి వేడుకున్నానని.. జగన్‌ మాత్రం వెకిలినవ్వు నవ్వుతున్నారని చంద్రబాబు విమర్శించారు.
 
ఐదు కోట్ల మంది ప్రజలు ఒకవైపు.. తుగ్లక్‌ జగన్‌ ఒక వైపని చంద్రబాబు అన్నారు. తప్పు చేస్తున్నామని తెలిసినా.. వైసీపీ ఎమ్మెల్యేలు ఏమీ చేయలేని దద్దమ్మలంటూ మండిడ్డారు. అమరావతిలో ల్యాండ్‌ పూలింగ్‌ తప్పు అని చెప్పిన నేతలు.. విశాఖలో పేదల అసైన్డ్‌ భూములు కొట్టేస్తున్నారని ఆరోపించారు. 
 
అలాగే, సీపీఐ నేత రామకృష్ణ కూడా మాట్లాడుతూ, ఎందుకు ఇలా చేస్తున్నావని సీఎం జగన్‌ని.. ఆయన తల్లి విజయలక్ష్మి కూడా అడిగారని అంటున్నారన్నారు. ఎంతో మంది రైతులు, మహిళలు ఆవేదన చెందుతున్నారని.. విజయలక్ష్మి చెప్పినా జగన్‌ వినడం లేదని చెప్పుకొచ్చారు. కనీసం జగన్‌.. తల్లి, భార్య మాట అయినా వినాలని సూచించారు. జగన్‌ పనుల్ని చూసి ఇతర రాష్ట్రాల వాళ్లు ఆశ్చర్యపోతున్నారన్నారు. ఒక్క రాజధాని కట్టడానికే డబ్బులు లేవు అంటున్నారు.. 3 రాజధానులు ఎలా కడతారని రామకృష్ణ ప్రశ్నించారు.