శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (12:44 IST)

మేడారం జాతరకు నో ప్లాస్టిక్- భారీగా తరలివస్తున్న భక్తులు

మేడారం జాతరకు తెలంగాణ సర్కారు భారీ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా మేడారం జాతరలో ప్లాస్టిక్‌పై నిషేధం విధించింది. ఏటూరు నాగారం అటవీ ప్రాంతం నుంచి ముందుగా మేడారం జాతరకు ముఖద్వారంగా ఉండే గట్టమ్మ ఆలయం దగ్గరకు శుక్రవారం నాటికే లక్షలమంది భక్తులు చేరుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వుండేందుకు ములుగు జిల్లా పాలనా యంత్రాంగం వాలంటీర్లను మోహరించింది. 
 
వీరంతా భక్తులు తమ వెంట తీసుకొచ్చే ప్లాస్టిక్ వస్తువులను సేకరిస్తున్నారు. భక్తుల నుంచి సేకరించిన ప్లాస్టిక్ వస్తువులతో ఓ భారీ ప్లాస్టిక్ స్టాచ్యూను తయారు చేసి ప్రవేశ ద్వారం ముందుంచారు. ప్లాస్టిక్‌పై యుద్ధం చేద్దామనే స్లోగన్లు ఇక్కడ కనిపించాయి. ఇలా చేయడం ద్వారా భక్తులకు ప్లాస్టిక్ వినియోగం వల్ల తలెత్తే ప్రమాదాలపై అవగాహన వస్తుందని అధికారులు చెప్తున్నారు.
 
అలాగే మేడారం జాతరకు వెళ్లే అన్ని రహదారులపై అక్కడక్కడ చెక్ పోస్టులను పెట్టారు. భక్తులు తమతో తీసుకువచ్చే ప్లాస్టిక్ వస్తువులను అక్కడే తీసుకోవడం చేస్తున్నారు. భక్తులకు వస్త్రాలతో తయారు చేసిన బ్యాగులను ఇస్తున్నారు. ఈ పండగను ప్లాస్టిక్ రహిత పండగగా చేయాలనుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.