1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 18 నవంబరు 2021 (13:50 IST)

ఆయేషా మీరా హత్య కేసు... త‌న‌కు న్యాయం జ‌ర‌గ‌లేద‌న్న‌ సత్యంబాబు

విజ‌య‌వాడ స‌మీపంలోని ఇబ్ర‌హీంప‌ట్నంలో గతంలో సంచలనం రేపిన బీఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్య కేసులో సుదీర్ఘ‌కాలం పోరాడి, సత్యం బాబు నిర్దోషిగా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, ఆ కేసులో త‌న‌కు న్యాయం కావాల‌ని స‌త్యంబాబు తాజాగా డిమాండు చేశాడు.  

 
స‌త్యంబాబు తనకు న్యాయం జరగలేదంటూ, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ని ఆశ్రయించాడు. దీనిపై కమిషన్ గురువారం ఢిల్లీలో విచారణ జరపనుంది. గ‌తంలో అయేషా కేసులో విజయవాడ పోలీసులు సత్యంబాబును అరెస్ట్ చేశారు. అత‌డు ఏకంగా తొమ్మిదేళ్లు జైలు శిక్ష అనుభవించాడు. 2017లో హైకోర్టు ఆయనను నిర్దోషిగా తేల్చడంతో జైలు నుంచి విడుదలయ్యాడు. సత్యంబాబును నిందితుడిగా చూపించిన అప్పటి పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం అతడికి నష్టపరిహారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. కానీ, ఆ త‌ర్వాత ప్ర‌భుత్వం అత‌న్ని ప‌ట్టించుకోలేదు.                        

 
ఆ రెండూ అమలుకాని పక్షంలో, స‌త్యంబాబు భ‌విష్య‌త్తులో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషను ఆశ్రయించవచ్చని హైకోర్టు అప్ప‌ట్లో త‌న తీర్పులో తెలిపింది. సత్యంబాబుకు రూ.10 లక్షలు, రెండు ఎకరాల భూమి, ఇల్లు మంజూరు చేశామని హైకోర్టు తీర్పు తర్వాత కృష్ణా జిల్లా అధికారులు ప్రకటించారు. కానీ, ఈ మూడు ఇప్పటి వరకు తనకు అందలేదని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు ఇచ్చిన ఫిర్యాదులో సత్యంబాబు ప్రస్తావించాడు. సత్యంబాబుతోపాటు దళిత సంఘాల ప్రతినిధులు, పౌరహక్కుల సంఘం నేతలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. 
 

స‌త్యంబాబు కేసు విచారణకు హాజరుకావాలని విజయవాడ పోలీసులకు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషను నోటీసులు జారీ చేసింది. దీనితో విజ‌య‌వాడ నుంచి ఒక ఏసీపీని విచారణ నిమిత్తం అధికారులు ఢిల్లీకి పంపారు. ఈ కేసులో స‌త్యంబాబు త‌ర‌ఫున జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషను ఎలా స్పందిస్తుందన్నది పోలీసుల్లో, అధికారుల్లో గుబులుగా మారింది.