వైజాగ్ -సింగపూర్ స్కూట్ విమాన సర్వీసులు పున:ప్రారంభం
విశాఖ నుంచి సింగపూర్ కు స్కూట్ విమాన సర్వీసును ఎంపి ఎంవివి సత్యనారాయణ, జీవీఎంసీ డిప్యుటీ మేయర్ జియ్యాని శ్రీధర్, ఎయిర్ పోర్టు డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రారంభించారు. విమానాశ్రయ టెర్మినల్ భవనంలో జ్యోతి ప్రజ్వళన చేసి విమాన సర్వీసును ప్రారంభించారు. తొలిరోజు ప్రయాణికులకు ఎంపి ఎంవివి సత్యనారాయణ టికెట్లను అందించారు.
స్కూట్ విమానం గతంలో 2019 లో ప్రారంభమయింది. ఆ తరువాత కోవిడ్ కారణంగా మార్చిలో నిలిపివేశారు. ఇపుడు ప్రత్యేకంగా బబుల్ ఆపరేషన్ ద్వారా తిరిగి సింగపూర్కు స్కూట్ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఎప్పటి నుంచో ఈ సర్వీస్ కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులకు ఇదొక శుభవార్తయింది. ఎయిర్పోర్టు డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, వారానికి మూడు రోజులు విమానం నడుస్తుందన్నారు. బుధవారం, శుక్రవారం, ఆదివారాల్లో ఉదయం 10.10 గంటలకు విశాఖ వస్తుందని, 11 గంటలకు బయలు దేరుతుందని తెలిపారు.
తొలి రోజు కొందరు ప్రయాణికులు ఢిల్లీ నుంచి వచ్చి, ఇక్కడ ఈ విమానంలో సింగపూర్ వెల్తున్నారని తెలిపారు. తొలి రోజుల్లో తక్కువ మంది ప్రయాణికులు వచ్చారని, ఈ రోజు 20 మంది ప్రయాణికులు మాత్రమే విశాఖ నుంచి వెళ్తున్నారని, రాను రాను ఈ విమానానికి ప్రయాణికుల ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు.