ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 అక్టోబరు 2022 (09:50 IST)

ఆస్పత్రిలో సమీర్ శర్మ - ఏపీ ఇన్‌ఛార్జ్ సీఎస్‌గా విజయానంద్

vijayanand
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఆయన స్థానంలో ఇన్‌ఛార్జ్ సీఎంగా విజయానంద్‌ను ప్రభుత్వం నియమించింది. సమీర్ శర్మ బుధవారం ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు లోనుకావడంతో ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. దీంతో సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్న విజయానంద్‌ను తాత్కాలిక సీఎస్‌గా ప్రభుత్వం నియమించింది. 
 
మరోవైపు, ఏపీ ప్రభుత్వం అనేక మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వహించి, ఆ తర్వాత ఢిల్లీలోని ఏపీ భవన్‌ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనరుగా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్ ప్రకాష్‌ను తిరిగి రాష్ట్రానికి బదిలీ చేసింది. సీఎం కార్యాలయంపై ప్రవీణ్ ప్రకాష్ తెచ్చిన ఒత్తిడితో ఆయన్ను రాష్ట్ర రోడ్లు భవనాల ముఖ్య కార్యదర్శిగా నియమించారు. 
 
అదేవిధంగా మరో సీనియర్ అధికారి వీరపాండ్యన్‌ను రాష్ట్ర ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. ఈ పోస్టుతో పాటు మార్క్ ఫెడ్ జేఎండీగా అదనపు బాధ్యతలను కేటాయించింది. 
 
మరోవైపు, భారత రక్షణ శాఖ కార్యదర్శిగా ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి గిరిధర్‌ను కేంద్రం నియమించింది. ఈయన హైదరాబాద్, వరంగల్‌లలో విద్యాభ్యాసం చేశారు. 1968 బ్యాచ్ ఏపీ కేడర్‌కు చెందిన గిరిధర్ ఉమ్మడి ఏపీలో చిత్తూరు, ఖమ్మం జిల్లాల కలెక్టరుగా కూడా విధులు నిర్వహించారు. ప్రస్తుతం కేంద్ర రవాణా శాఖ కార్యదర్శిగా ఉన్న గిరిధర్ ఈ నెల 31వ తేదీన రక్షణ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.