గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 అక్టోబరు 2022 (12:29 IST)

వైజాగ్ ఎయిర్‌పోర్టులో ఘటన.. ఇద్దరు సీఐలపై బదిలీవేటు

Vijayawada airport
విశాఖపట్టణంలో అధికార వైకాపా నేతలు మూడు రాజధానులకు మద్దతుగా ఈ నెల 15వ తేదీ గర్జన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇది పూర్తిగా విఫలమైంది. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మంత్రులు తిరిగి అమరావతికి బయలుదేరారు.

అదేసమయంలో జనవాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అదే రోజున విశాఖకు చేరుకున్నారు. పవన్‌కు స్వాగతం పలికేందుకు ఆయన అభిమానులతో పాటు జనసేన కార్యకర్తలు భారీగా ఎయిర్‌పోర్టుకు తరలి వచ్చారు.

పవన్ విమానాశ్రయంలో ఉన్న సమయంలోనే వైకాపా మంత్రులు తిరుగు ప్రయాణంలో ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 
 
ఆ సమయంలో బందోబస్తు విధుల్లో ఉన్న ఇద్దరు సీఐలు పి.వి.ఎస్‌.ఎన్‌.కృష్ణారావు (కంచరపాలెం స్టేషన్‌), ఉమాకాంత్‌ (ఎయిర్‌పోర్ట్‌ స్టేషన్‌)లు ఆకస్మికంగా బదిలీ కావడం పోలీసువర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వారికి పోస్టింగులు కూడా ఇవ్వకుండా వీఆర్‌కు (వేకెన్సీ రిజర్వ్‌) పంపారు. 
 
విశాఖ పోలీసు కమిషనరేట్‌ పరిధి నుంచి విశాఖ రేంజికి సరెండర్‌ చేశారు. బదిలీ ఉత్తర్వులు మంగళవారం మధ్యాహ్నం జారీచేయగా సాయంత్రానికల్లా వారి స్థానాల్లో వచ్చిన సీఐలు బాధ్యతలు స్వీకరించారు. నిజానికి ఈ ఇద్దరు సీఐలు విశాఖ ఎయిర్‌పోర్టులో విధుల్లో ఉన్నపుడే ఘర్షణలు జరిగాయి. ఆ మేరకు కేసులు నమోదయ్యాయి. 
 
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాక సందర్భంగా ఆయన అభిమానులు విశాఖ విమానాశ్రయానికి వచ్చారు. వారందరూ అక్కడ ఉన్నప్పుడే మంత్రులు వారి ముందు నుంచే ప్రయాణించాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో బందోబస్తులో వైఫల్యం వల్లనే ఆ ఇద్దరిపై బదిలీ వేటు పడిందని ప్రచారం జరుగుతోంది. 
 
నిజానికి ఈ ఇద్దరు సీఐలు చాలా కాలంగా ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు. అందువల్ల వారిని బదిలీ చేశామనీ, బందోబస్తులో వైఫల్యం కారణంగా బదిలీ చేసినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. నాటి పరిణామాలపై విచారణ మాత్రం జరుగుతోందని తెలిపారు.