శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 24 సెప్టెంబరు 2022 (11:25 IST)

Reliance Industries: ఆస్తుల పంపకాల్లో కొడుకులతో సమానంగా కూతురికీ ముకేశ్ అంబానీ ప్రాధ్యాన్యం ఇస్తున్నారా?

Mukesh-Nita Ambani
తన వ్యాపార సామ్రాజ్యాల్లో తన వారసుల్లో ఎవరికి ఏది అప్పగించాలో భారత బిలియనీర్ ముకేశ్ అంబానీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సంకేతాలు ఇచ్చారు. గత ఆగస్టులో జరిగిన ఒక వార్షిక సమావేశంలో రీటెయిల్ నుంచి రిఫైనింగ్ వరకు తన 220 బిలియన్ డాలర్లు (రూ.17.54 లక్షల కోట్లు) వ్యాపార సామ్రాజ్యంలో తన ముగ్గురి వారసుల్లో ఎవరికి ఏది అప్పగించబోతున్నారో ఆయన చూచాయగా స్పష్టంచేశారు. తొలి సంతానమైన కవలలు ఆకాశ్, ఇషాలకు..వరుసగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ టెలికమ్యూనికేషన్స్, రీటెయిల్ బిజినెస్‌లు అప్పగించబోతున్నారు. మరోవైపు తన చిన్న కుమారుడు అనంత్‌కు ఎనర్జీ విభాగం బాధ్యతలు ఇవ్వబోతున్నారు.

 
మార్కెట్‌ అంచనాల ప్రకారం భారత్‌లోని అత్యంత విలువైన కంపెనీల్లో రిలయన్స్ ఒకటి. దీనిలో అధికార బదిలీ జరగబోతోందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇంకా పూర్తిస్థాయిలో వివరాలు బయటకు రావాల్సి ఉంది. అయితే, గతంలో జరిగిన తప్పులను పునరావృతం కాకుండా చూడాలని అంబానీ జాగ్రత్త పడుతున్నట్లు ఈ వివరాలతో స్పష్టం అవుతోంది. అప్పట్లో తండ్రి ఆస్తుల కోసం తన సోదరుడితో ముకేశ్ దాదాపు 20 ఏళ్ల పాటు పోరాడాల్సి వచ్చింది. తండ్రి ధీరూభాయ్ అంబానీ వీలునామా రాయకపోవడమే దీనికి కారణం. సాధారణంగా అంబానీ కుటుంబంలో మహిళలు వ్యాపారాల్లో క్రియాశీలంగా కనిపించరు. కానీ, ఇషా అంబానీకి మాత్రం ఇప్పుడు కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారు. గత రెండు దశాబ్దాల్లో భారత దిగ్గజ పారిశ్రామిక కుటుంబాల్లో ఈ కొత్త ఒరవడి కనిపిస్తోంది. అయితే, ఈ దిశగా ఇంకా చాలా మార్పులు అవసరం అవుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

 
ముందుగానే ప్రణాళిక
65ఏళ్ల అంబానీ ప్రస్తుతం రిలయన్స్ చైర్మన్‌గా, మేనేజింగ్ డైరెక్టర్‌గా క్రియాశీలంగానే పనిచేస్తున్నారు. ఆయన కావాలంటే పిల్లలకు కాస్త ఆలస్యంగా బాధ్యతలు అప్పగించొచ్చు. చాలా మంది ఆసియా దిగ్గజ వ్యాపారవేత్తలు తమ జీవితాల్లో చివరి అంకం వరకు తమ సామ్రాజ్యాలపై గట్టి పట్టు కొనసాగిస్తుంటారు. కానీ, ముకేశ్ అంబానీ దీనికి భిన్నంగా నడుచుకుంటున్నారని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లోని 'థామస్ స్కిమిడెనీ సెంటర్ ఫర్ ఫ్యామిలీ ఎంటర్‌ప్రైస్' సీనియర్ అడ్వైజర్, ప్రొఫెసర్ కవిల్ రామచంద్రన్ వ్యాఖ్యానించారు.

 
''ఆస్తుల్లో వాటాల కోసం పోరాటాలను ప్రత్యక్షంగా చూసిన నేటితరం ఆసియా దిగ్గజ పారిశ్రామిక వేత్తలు తమ పిల్లలకు ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకుంటున్నారు''అని ఆయన అన్నారు. జాగ్వార్, లాండ్ రోవర్‌ల మాతృసంస్థ టాటా గ్రూప్‌తో మొదలుపెట్టి, రేమండ్ గ్రూప్ మాతృసంస్థ సింఘానియా కుటుంబం వరకు ఇలా చాలా దిగ్గజ పారిశ్రామిక కుటుంబాల్లో ఆస్తి పంపకాల కోసం పోరాటాలు జరిగాయి. కొన్నిసార్లు సుదీర్ఘ కోర్టు కేసులు, మరికొన్నిసార్లు మధ్యవర్తులతో చర్చల వల్ల కంపెనీల షేర్‌ హోల్డర్లపై చాలా ప్రభావం పడుతోంది. గతంలో చేదు అనుభవాల వల్లే ప్రస్తుతం అంబానీ లాంటి కుటుంబాలు చాలా అప్రమత్తంగా ముందుకు వెళ్తున్నట్లు నిపుణులు అంటున్నారు.

 
''కోవిడ్-19 వ్యాప్తి తర్వాత తరాల నుంచి వస్తున్న ఆస్తుల పంపకం అనే అంశం మరింత కీలకంగా మారింది''అని వెల్త్ కన్సల్టింగ్ సంస్థ హబ్బిస్ వివరించింది. ఆసియా కుటుంబాల్లో సగం కంటే తక్కువ మంది దగ్గర మాత్రమే ఇలాంటి వీలునామాలు ఉండేవి. అయితే, కోవిడ్-19 తర్వాత ఆస్తులను ఎలా బదిలీ చేయాలనే అంశంపై దాదాపు 84 శాతం ధనిక కుటుంబాలు దృష్టి సారించాయని గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ అంచనా వేస్తోంది.

 
లింగ వివక్షకు లేకుండా..
ప్రస్తుతం తమ సామ్రాజ్యాలను అప్పగించే క్రమంలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం కూడా కనిపిస్తోంది. తమ ముగ్గురు పిల్లలకు నాయకత్వ బాధ్యతలు అప్పగించబోతున్నట్లు చెబుతూ ముకేశ్ అంబానీ ఇచ్చిన ప్రసంగంలో వీరిని ''ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్''గా అభివర్ణించారు. ఇప్పటికే రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యంలో వీరు అద్భుతాలు సృష్టిస్తున్నారని అన్నారు. తన సోదరుడితో సమానంగా ఇషా అంబానీకి ప్రాధాన్యం ఇవ్వడమనేది ఈ కుటుంబంలో కొత్త విషయం. అంబానీ కుటుంబం ఆస్తి గొడవలతో చిన్నాభిన్నం కాకముందే, ఇషా మేనత్తలకు ఇతర ధనిక కుటుంబాలతో పెళ్లిళ్లు అయ్యాయి. వారు ఇప్పుడు వ్యాపార సామ్రాజ్యాల్లో క్రియాశీలంగా లేరు.

 
అయితే, యేల్ వర్సిటీలో చదువుకున్న ఇషా అంబానీ, కన్సల్టింగ్ దిగ్గజం మెక్‌కెన్సీలో పనిచేశారు. రియలన్స్‌ను నడిపించేందుకు అవసరమైన నైపుణ్యాలను ఆమె అక్కడ అందిపుచ్చుకున్నారు. ''భారత పరిశ్రమలో అంబానీలకు మంచి పలుకుబడి ఉంది. మహిళలను ప్రోత్సహించేలా తీసుకున్న ఈ నిర్ణయాన్ని గుజరాతీ పారిశ్రామిక కుటుంబాలు జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ఇవి వారిపై మంచి ప్రభావం చూపే అవకాశముంది''అని ప్రొఫెసర్ రామచంద్రన్ అన్నారు. మిగతా పారిశ్రామిక కుటుంబాలకు దీని ద్వారా అంబానీ మంచి సందేశం పంపించారని లెగసీ ప్లానింగ్ సంస్థ టెనెన్సియా వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ నర్లేకర్ చెప్పారు. దిగ్గజ పారిశ్రామిక కుటుంబాల్లో ఆస్తి పంపకాల్లో దశాబ్దానికి పైగా ఆయన సాయం చేస్తున్నారు.

 
వ్యాపారాల్లో కీలకమైన నాయకత్వ బాధ్యతలు తీసుకున్న కొత్తతరం పారిశ్రామిక కుటుంబ మహిళల్లో ఇషా కూడా ఒకరు. గోద్రేజ్ కన్సూమర్ ప్రోడక్ట్స్‌కు నేతృత్వం వహిస్తున్న నిసాబా గోద్రేజ్, పెర్ల్ అగ్రోకు నాయకత్వం వహిస్తున్న నదియా చౌహాన్ ఇలా మరికొంత మంది మహిళలు ఇదే కోవకు చెందుతారు. ఇలా మార్పు రావడానికి చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ''ఉన్నత విద్యను అభ్యసిస్తున్న మహిళల సంఖ్య పెరగడం, పెద్ద కుటుంబాల స్థానంలో చిన్న కుటుంబాలు ఏర్పడటం లాంటివి'' వాటిని వారు ఉదాహరించారు. ''తమ హక్కులు, సామర్థ్యాల కోసం ఎక్కువ మంది మహిళలు నేడు మాట్లాడుతున్నారు''అని వెల్‌స్పన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ దీపాలీ గోయెంకా చెప్పారు. భారత్‌లో దిగ్గజ జౌళీ పరిశ్రమల్లో ఒకటైన వెల్‌స్పన్ గ్రూప్‌లో ఈ సంస్థ కూడా భాగం.

 
18ఏళ్ల వయసులో గోయెంకాకు వివాహమైంది. పిల్లలు పెద్దైన తర్వాత ఆమె తన భర్తతోపాటు వ్యాపారంలోకి వచ్చారు. ఆ తర్వాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌కు కూడా ఆమె చదువుకోవడానికి వెళ్లారు. అయితే, మహిళలకు ప్రాధాన్యం ఇచ్చే దిశగా మనం చేయాల్సింది చాలా ఉంది. ఆస్తుల పంపకాల్లో భారత్‌లోని ప్రతి పది కుటుంబాల్లో ఎనిమిది కొడుకులకే ప్రాధాన్యం ఇస్తున్నాయని ఇటీవల ఒక అధ్యయనంలో తేలినట్లు నర్లేకర్ చెప్పారు. ''మరోవైపు మిగతా కుటుంబాల్లోనూ కొడుకులు, కుమార్తెల మధ్య సమానంగా పంపకాలు జరగడం లేదు''అని ఆయన వివరించారు. చెన్నైకు చెందిన మురుగప్ప గ్రూప్‌ వారసుల్లో ఒకరైన వల్లి అరుణాచలం తనను బోర్డు సభ్యురాలిగా నియమించాలని కోర్టు వరకు వెళ్లడాన్ని చూస్తే, మహిళలు ఎంత కష్టపడాల్సి వస్తోందో తెలుస్తోంది.

 
హిందువుల ఆస్తి బదిలీ చట్టాలు మహిళలకు సమాన ఆస్తి హక్కులు ఇస్తున్నాయి. వీటి వల్ల చాలా మంది మహిళలకు మేలు జరుగుతోంది. మరోవైపు కంపెనీల బోర్డుల్లో మహిళలకూ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు కూడా కొంతవరకు తోడ్పడుతున్నాయి. అయితే, పురుషాధిపత్యంపై పోరాటం ఇప్పుడే మొదలైందని నిపుణులు అంటున్నారు.