ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 అక్టోబరు 2022 (08:38 IST)

గుంటూరులో అందరూ చూస్తుండగానే దారుణం హత్య.. భయభ్రాంతులకు గురైన ప్రజలు

murder
గుంటూరు పట్టణంలో మంగళవారం రాత్రి ఓ దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిని కొందరు దుండగులు దారుణంగా చంపేశారు. కత్తులు, వేటకొడవళ్ళతో వెంటాడి మరీ చంపేశారు. కళ్లముందే జరిగిన ఈ దారుణం చూసి జన భయభ్రాంతులకు గురయ్యారు. 
 
తనను వెంటాడుతున్న దుండగుల నుంచి తనను తాను కాపాడుకోవడానికి ఓ కిరాణా షాపులోకి వెళ్లగా, అక్కడ నుంచి బయటకు ఈడ్చుకొచ్చి మరీ దారుణం హత్య చేశాడు. ఈ దారుణం గుంటూరు నగరంలోని పట్నంబజార్ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయానికి సమీపంలోని బాబు హోటల్ వద్ద మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో జరిగింది. 
 
మృతుడిని నల్లచెరువు ఆరో లైన్‌కి చెందిన 38 యేళ్ల దొడ్డి రమేశ్‌గా గుర్తించారు. ఈయన ఫైనాన్స్ వ్యాపారంతోపాటు శుభకార్యాలకు డెకరేషన్ పనులు చేస్తుంటాడు. హత్యకు ముందు రమేశ్ ఇంట్లోనే ఉన్నాడని, స్నానానికి వెళ్లేందుకు రెడీ అవగా ఫోన్ రావడంతో బయటకు వెళ్లాడని రమేశ్ తల్లి తెలిపారు. 
 
రమేశ్‌ ఓ హత్యకేసులో నిందితుడని, అతడిపై రౌడీషీట్ కూడా ఉందని పోలీసులు తెలిపారు. కాగా, తన భర్తను బుడంపాడుకు చెందిన రౌడీ షీటర్ ఆర్కే హత్య చేశాడని రమేశ్ భార్య లత ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. పరారీలో ఉన్న నిందితుల కోసం రెండు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.