శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 9 ఆగస్టు 2019 (06:10 IST)

సేవలు ప్రజల ఇంటి ముంగిటకు... పౌర సంబంధాల శాఖా మంత్రి నాని

ప్రభుత్వం నుండి సేవలు పొందే హక్కును ప్రజల ఇంటి ముంగిటకు అందించడమే గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రధాన ఉద్దేశ్యమని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) చెప్పారు. స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో గురువారం మచిలీపట్నం మండలంలో గ్రామ వాలంటరీర్లుగా ఎంపిక కాబడిన అభ్యర్ధులకు రెండు రోజులపాటు నిర్వహించనున్న శిక్షణా కార్యక్రమాలను మంత్రి నాని ప్రారంభించారు.

ఈ సందర్బంగా మంత్రి పేర్ని నాని వాలంటీర్లలో స్పూర్తిని నింపే విధంగా గ్రామ సచివాలయం వ్యవస్థ ఏర్పాటు ప్రధాన ఉద్దేశ్యం, వాలంటీర్ల విధులు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన రెడ్డి తన పాదయాత్రలో ప్రజల కష్టాలు, బాధలను దగ్గర నుండి గమనించారని, ప్రభుత్వ కార్యాలయాలలో ప్రజలకు సేవలు అందే విధానంలో అవినీతి, అక్రమాలతో ప్రజలు విసిగిపోయారని మంత్రి పేర్ని నాని చెప్పారు.

గత ప్రభుత్వ పాలనలో ప్రజాప్రతినిధులు నిర్లజ్జగా అవినీతికి పాల్పడ్డారన్నారు. ప్రభుత్వం నుండి సేవలను డబ్బుతో కొనకుండా ఒక హక్కుగా సాధించుకోవాలని, ప్రజల గుమ్మం వద్ద కే పాలనను తీసుకువెళ్లేందుకు గ్రామ సచివాలయ వ్యవస్థకు రాష్ట్ర ముఖ్యమంత్రి తన పాదయాత్రలో నే ఆలోచన చేశారన్నారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే గ్రామ సచివాలయ వ్యవస్థకు సంబందించి 50 కుటుంబాలకు ఒక గ్రామ/వార్డు వాలంటీరును, ప్రతీ 2 వేల మంది ప్రజలకు శాశ్వత ప్రాతిపదికపై ఒక గ్రామ/వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని పాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు. వాలంటీర్లు తమకు కేటాయించిన గృహాలను సందర్శించి, పెన్షన్, రేషన్ సరుకులను అందించడమే కాక వారి సమస్యలను తెలుసుకుని, వాటిని గ్రామ సచివాలయం దృష్టికి తీసుకువచ్చి, 72 గంటలలోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవలసి ఉంటుందన్నారు.

గ్రామ సచివాలయంలో 11 శాఖలకు సంబందించిన సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన నియమించడం జరుగుతుందని, వారి పరిధిలో ప్రజల సమస్యలు తెలుసుకుని, 72 గంటలలోగా పరిష్కరించడమే వారి ప్రధమ కర్తవ్యమన్నారు. ప్రజల కష్టాలు, సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం ద్వారా నిరు పేద ప్రజలలో స్వాంతన కలిగించడమే వాలంటీర్ల ప్రధాన మైన విధి అని మంత్రి చెప్పారు.

ప్రజల కాంక్షలను నెరవేర్చి, ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశాన్ని సేవా దృక్పథంతో అందిపుచ్చుకుని , అవినీతికి అవకాశం లేకుండా వాలంటీర్లు తమ విధులను నిర్వర్తించాలన్నారు. ఈ దిశగా గ్రామ వాలంటీర్లు ముఖ్యమంత్రి ఆశయసాధనలో భాగస్వాములు కావాలన్నారు. గ్రామ వాలంటీర్ల విధి నిర్వహణలో ఎక్కడైనా అవినీతి మరక అంటితే వెంటనే వారిని విధుల నుండి తొలగిస్తామన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం 150 మంది శాసనసభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి, అవినీతిపై ప్రభుత్వ విధానాలను స్పష్టంగా తెలియజేశారని, ఏ శాసనసభ్యడుగాని, మంత్రిగాని అవినీతికి పాల్పడితే వెంటనే వారిని నిర్దాక్షిణ్యంగా తొలగిస్తామని చెప్పారన్నారు.

అదేవిధంగా మంత్రివర్గంలో 60 శాతానికి పైగా షెడ్యూల్డు కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, మైనార్టీలకు అందించారని అంతేకాక 50 శాతం మహిళలకు కూడా కేటాయించారన్నారు. రిజర్వేషన్ల గురించి మాటలలో కాకుండా చేతలలో చేసి చూపించారన్నారు. 
 
బియ్యం సబ్సిడీకి ఏటా రూ.9 వేల కోట్ల ఖర్చు...  
రాష్ట్రంలో 1.30 కోట్ల తెల్లరంగు రేషన్ కార్డులున్నాయని, పేదలకు రేషన్ దుకాణాల ద్వారా అందించే బియ్యానికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.9 వేల కోట్ల ఖర్చు చేస్తున్నదన్నారు. అయినప్పటికీ సదరు బియ్యాన్ని పేదవారు వినియోగించుకోకపోవడంతో పక్కదారి పట్టి ప్రజా ధనం దుర్వినియోగమవుతుందన్నారు.

ఈ విషయంపై ముఖ్యమంత్రి ఆలోచన చేసి, ప్రజల వినియోగించుకునేలా నాణ్యమైన బియ్యాన్ని 5,10,15, 20 కేజీల సంచులలో నేరుగా లబ్దిదారుల ఇంటికి గ్రామ వాలంటీర్ల ద్వారా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నదన్నారు. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం గ్రామ సచివాలయాల ద్వారా సాకారమవుతుందని మంత్రి ఈ సందర్బంగా చెప్పారు. కార్యక్రమంలో మెప్మా పిడి జి.వి.సూర్యనారాయణ, లంకే వెంకటేశ్వరరావు, వి.రవిశంకర్, తదితరులు పాల్గొన్నారు.