1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 జులై 2025 (19:23 IST)

డ్రైవర్ డోర్ డెలివరీ హత్య కేసు పునర్విచారణ : స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ

car driver murder case
తన కారు మాజీ డ్రైవరు, దళిత యువకుడు సుబ్రహ్మణ్యంను హత్య చేసి మృతదేహాన్ని ఇంటికి డోర్ డెలివరీ చేసిన కేసు పునర్విచారణకు రాజమండ్రి ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు ఆదేశించింది. దీనిపై స్టే విధించాలని కోరుతూ ఈ కేసులో ప్రధాన నిందితుడైన వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు హైకోర్టును ఆశ్రయించగా, ఆయనకు చుక్కెదురైంది. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. 
 
మూడేళ్ల క్రితం కాకినాడలో సుబ్రహ్మణ్యంను హత్య చేసి, మృతదేహాన్ని అనంతబాబు తన కారులో తీసుకెళ్లి మృతుడు తల్లిదండ్రులకు అప్పగించారు. ఇది అపుడు సంచలనంగా మారింది. ఈ కేసులో అనంతబాబు నేరాన్ని అంగీకరించినట్టు నాటి మీడియా సమావేశంలో ఎస్పీ రవీంద్రనాథ్ బాబు వెల్లడించారు. ఆ తర్వాత ఆయనను అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించగా, పిమ్మట మధ్యంతర బెయిలుపై విడుదలయ్యారు. 
 
అయితే, తమకు న్యాయం కావాలని ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించి అనంతబాబుపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం కోరింది. దీనిపై ఏపీలో ఏర్పాటైన టీడీపీ కూటమి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేయగా, ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. 
 
మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు సమగ్ర దర్యాప్తునకు అనుమతి కోరుతూ ప్రత్యేక దర్యాప్తు బృందం ఇటీవల కోర్టును ఆశ్రయించగా ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం అంగీకరించింది. 90 రోజుల్లో అదనపు చార్జిషీట్‌ను దాఖలు చేయాలని ఆదేశించింది. ఎస్టీ ఎస్టీ న్యాయస్థానం ఆదేశాలను అనంతబాబు హైకోర్టులో సవాల్ చేయగా, ఆయనకు చుక్కెదురైంది. పైగా, కేసు తదుపరి విచారణకు అనుమతి ఇచ్చింది.