గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 జులై 2020 (20:53 IST)

ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి కరోనా.. ఎవరూ రావొద్దంటూ వినతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. తాజాగా ఆ జాబితాలో కర్నూలు జిల్లాకు చెందిన శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి కూడా చేరారు. టెస్టుల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఆయన హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. తనకు కరోనా సోకిన విషయాన్ని ఆయన ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. 
 
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా శిల్పా చక్రపాణిరెడ్డి నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో కరోనా పరీక్షలు చేయించుకుని హైదరాబాదుకు వెళ్లిపోయారు. అయితే, పరీక్షల ఫలితాలు వచ్చేసరికి మూడు రోజులు పట్టింది. దీంతో ఆయన హైదరాబాదులో తన నివాసంలో క్వారంటైన్‌లో ఉన్నారు.
 
తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని... దీంతో, క్వారంటైన్‌లో ఉంటూ తగిన చికిత్స పొందుతున్నానని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు. నెగెటివ్ వచ్చేంత వరకు క్వారంటైన్‌లోనే ఉండాల్సిన అవసరం ఉందని... చికిత్స కాలం ముగిసేంత వరకు తనను కలిసేందుకు ఎవరూ రావద్దని విన్నవించారు. కనీసం ఫోన్ ద్వారా మాట్లాడే ప్రయత్నం కూడా చేయవద్దని కోరారు. ఏవైనా అప్ డేట్స్ ఉంటే సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తానని చెప్పారు.
 
గత కొన్ని రోజులుగా తనతో ఉన్న సన్నిహితులందరికీ కరోనా టెస్టులు చేయడం జరిగిందని... వారందరికీ నెగెటివ్ వచ్చిందని శిల్పా తెలిపారు. ఇటీవల నియోజకవర్గంలో తనతో పాటు కలిసి ప్రయాణించిన ప్రతి ఒక్కరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని విన్నవించారు. 
 
కరోనా లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను కలవాలని సూచించారు. జన సమూహంలోకి వచ్చినప్పుడు కచ్చితంగా మాస్కులు ధరించాలని, భౌతికదూరాన్ని పాటించాలని కోరారు. కోవిడ్ ప్రొటోకాల్ ను ప్రతి ఒక్కరూ పాటించాలని, ఎవరిని వారే రక్షించుకోవాలని సూచించారు.