సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 జులై 2020 (16:41 IST)

భారత్‌లో కరోనా సోకని ప్రాంతం ఏది? కేంద్రం ఓకే అంటే బడిగంటలు మోగుతాయ్...

దేశంలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఫలితంగా ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య శుక్రవారానికి పది లక్షలు దాటిపోయింది. ప్రపంచంలో కరోనా కేసుల నమోదు గత యేడాది ఆఖరులో నమోదైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు అన్ని దేశాల్లో ఈ వైరస్ వ్యాపించింది. 
 
కానీ, భారత్‌లోని ఓ భాగంలో మాత్రం ఈ వైరస్ వ్యాప్తి ఏమాత్రం లేదు. అదే లక్షద్వీప్. కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో ఇప్పటివరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా రాలేదంటే ఆశ్చర్యం కలగకమానదు. కానీ ఇది నిజం. భారత్‌లో ఫిబ్రవరిలో కరోనా వ్యాప్తి ప్రారంభం కాగా, ఇప్పటివరకు లక్షద్వీప్‌లో కరోనా పాజిటివ్ అన్న మాటే వినపడలేదు. దానికి కారణం అక్కడి ప్రభుత్వ యంత్రాంగం సమర్థత అని కొనియాడాల్సిందే. 
 
లక్షద్వీప్ జనాభా 64,473 కాగా, అందుబాటులో ఉన్న ఆస్పత్రులు కేవలం మూడంటే మూడే. దాంతో, నివారణ చర్యలపైనే అక్కడి ప్రభుత్వం కఠినంగా దృష్టి పెట్టింది. రాజధాని కవరాట్టికి వచ్చే ప్రతి ఒక్కరిపై నిఘా ఉంచడమే కాదు, వారికి తప్పనిసరిగా క్వారంటైన్ విధించసాగారు. 
 
అంతేకాదు, తమ ప్రాంతానికి రావాలనుకునేవారిని కేరళలోని కొచ్చి రేవుపట్టణంలో రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉండాలన్న నిబంధన విధించారు. లక్షద్వీప్‌కు ప్రధాన రవాణా కొచ్చి నుంచే జరుగుతుంది కాబట్టే, ఇక్కడి నుంచి వారి కరోనా నివారణ చర్యలు మొదలవుతాయి.
 
దేశంలో కరోనా వ్యాప్తి ప్రమాదకర స్థితికి చేరిందని తెలియగానే లక్షద్వీప్ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. లోపలికి ఎవరినీ అనుమతించకుడా కరోనాను ఆమడదూరంలో నిలిపివేసింది. ఓవైపు భారత్ ప్రధాన భూభాగం సహా, ఇతర ప్రాంతాల్లో కేసులన్నీ కలిపి 10 లక్షలు దాటినా, ఈ చిన్న చిన్న ద్వీప సమూహంలో మాత్రం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 
 
61 మందికి అనుమానిత లక్షణాలు కనిపించడంతో ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించగా, అందరికీ నెగెటివ్ వచ్చింది. మొత్తమ్మీద కరోనాపై పోరాటంలో లక్షద్వీప్ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పుడక్కడ స్కూళ్లు తెరిచేందుకు సన్నద్ధమవుతున్నారు. కేంద్రం ఓకే అంటే చాలు బడిగంటలు మోగనున్నాయి.