పొత్తులపై మేమిద్దరం మంచి క్లారిటీతోనే ఉన్నాం : సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తులపై ఏపీ శాఖ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. పొత్తుల అంశంలో తాను, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్‌లు ఓ పక్కా క్లారిటీతోనే ఉన్నామని చెప్పారు.
కాగా, మంగళవారం తెలంగాణ రాష్ట్రంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో తన ప్రచార రథం వారాహికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా ఆయన ప్రచార రథంపై నుంచి మాట్లాడుతూ, బీజేపీతో పొత్తులే ఉన్నాం అంటూ ఓ సందిగ్ధత వ్యక్తం చేశారు.
ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు ఖాయమనే వార్తలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీతో పొత్తుపై పవన్ అస్పష్టంగా వ్యాఖ్యానించగా, వీటిపై సోము వీర్రాజు స్పందించారు. పొత్తులపై తామిద్దరం ఓ క్లారిటీతోనే ఉన్నామన్నారు. ఇందులో ఎలాంటి గందరగోళం లేదన్నారు.
తొలుత తమ పొత్తు ప్రజలతోనే ఉంటుందని వ్యాఖ్యానించి సోము వీర్రాజు.. ఆ తర్వాత పవన్ చేసిన వ్యాఖ్యల అనంతరం తన మాటలను ఆయన సవరించుకోవడం గమనార్హం. కాగా, ఏపీలో బీజేపీ, జనసేన పార్టీల మధ్య గత కొంతకాలంగా ఉమ్మడి కార్యాచరణ అంటూ ఏదీ లేదు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు పొడుస్తుందా లేదా అన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి.