శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 అక్టోబరు 2022 (08:38 IST)

పవన్, సోము వీర్రాజు మీట్.. ఆ హోటల్‌లో గందరగోళం.. ఉదయం ఐదు గంటలకు?

Pawan Kalyan
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు విజయవాడలో పవర్ స్టార్ పవన్‌ను కలిశారు. ఆపై సంయుక్తంగా మీడియా ముందుకు వచ్చారు. తనకు మద్దతు తెలిపేందుకు వచ్చిన బీజేపీ నేతలకు పవన్ ధన్యవాదాలు తెలిపారు. విశాఖలో నిన్నటి ఘటన పూర్తిగా ప్రభుత్వ కుట్రగా భావిస్తున్నామని అన్నారు. సన్నాసులు ఏదో వాగుతారని, వారి గురించి పట్టించుకోనవసరంలేదని అభిప్రాయపడ్డారు. 
 
సోము వీర్రాజు మాట్లాడుతూ, విశాఖలో నిర్వహించిన వైసీపీ గర్జన ప్రభుత్వం స్పాన్సర్ చేసిన కార్యక్రమం అని ఆరోపించారు. అయితే ఆ కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో వైసీపీ నేతలు తీవ్ర అసహనానికి గురై జనసేనపై కుట్రకు తెరదీశారని వివరించారు. 
 
అంతకుముందు, పవన్‌ను కలవడంపై సోము వీర్రాజు ట్విట్టర్‌లో స్పందించారు. మిత్రపక్షం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించానని వెల్లడించారు. 
 
వ్యక్తిగత దూషణలతో మొదలైన వైసీపీ ప్రస్థానం, పోలీసులను అడ్డంపెట్టుకుని వ్యక్తిగత స్వేచ్ఛను హరించే స్థాయికి చేరిన తీరును ప్రజలు గమనిస్తూనే ఉన్నారని వివరించారు. 
 
అంతకుముందు విశాఖపట్నంలో చోటుచేసుకున్న ఘటనలపై మంగళగిరిలో మీడియా సమావేశం నిర్వహించారు పవన్ కల్యాణ్. వైసీపీ నేతల భూకబ్జాలు బయటపడతాయనే తమ జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు. 
 
తాము డ్యూటీ చేస్తున్నామని పోలీసులు చెప్పారని, అందుకు తనకేమీ అభ్యంతరంలేదని చెప్పానని, జనసేన చేస్తున్నది పోలీసులతో యుద్ధం కాదని స్పష్టం చేశానని వివరించారు. తాను బస చేసిన హోటల్‌లో అర్ధరాత్రి నుంచి వేకువజామున నాలుగున్నర, ఐదు గంటల వరకు ఒక ఫ్లోర్ మొత్తం గందరగోళం సృష్టించారు. 
 
అరుపులు, కేకలు, బాదడాలు, చప్పుళ్లతో భయానక వాతావరణం సృష్టించారు. పాపం, విదేశాల నుంచి వచ్చినవారు కూడా నోవోటెల్ హోటల్‌లో ఉన్నారు. టూరిజం పరంగా ఎంత తప్పుడు సంకేతాలు వెళతాయి? వైసీపీ ప్రభుత్వానికి ఇది సిగ్గుచేటని పవన్ ఫైర్ అయ్యారు.