శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 2 ఆగస్టు 2019 (19:36 IST)

గవర్నర్ జన్మదిన వేడుకలకు విశేష ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ హోదాలో బిశ్వభూషన్ హరిచందన్ తన 85వ జన్మదిన వేడుకలను శనివారం జరుపుకోనున్నారు. ఎనభై ఐదు వసంతాలను పూర్తి చేసుకున్న గవర్నర్ 86వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. పుట్టిన రోజు నేపధ్యంలో పలు ప్రజాహిత కార్యక్రమాలలో పాల్గొననున్న రాష్ట్ర ప్రధమ పౌరుడు చిన్నారుల సమక్షంలో వేడుకలు జరుపుకోనున్నారని గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా వివరించారు. 

ఉదయం తిరుమల తిరుపతి దేవస్ధానం, కనకదుర్గమ్మ దేవస్ధానం వేదపండితులు గవర్నర్ కు ఆశీర్వచనం అందిస్తారు. తదుపరి గిరిజన, దళిత బాలబాలికల సమక్షంలో కేక్ కటింగ్ నిర్వహించి చిన్నారులకు గవర్నర్ నూతన వస్త్రాలు బహుకరిస్తారు. వారి విద్యార్జనలో అంతర్భాగంగా ఉండే నోట్ పుస్తకాలను కూడా పంపిణీ చేస్తారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఔన్నత్యాన్ని పెంపొందించే కూచిపూడి ప్రదర్శనతో సహా పలు కార్యక్రమాలు ఉంటాయి.

ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న నేపధ్యంలో ప్రభుత్వం తరుపున రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు రాజ్ భవన్ కు వచ్చి గవర్నర్ కు జన్మదిన శుభాకాంక్షలు అందిస్తారు. చివరగా నగరంలోని ఆంధ్రా లయోలా కళాశాల ఆవరణలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే రక్తదాన శిభిరంను ప్రారంభిస్తారు. కళాశాల ఆవరణలో మొక్కలు నాటుతారు.

జన్మదిన వేడుకల నేపధ్యంలో ముందుగా అనుమతి తీసుకున్న ఆహ్వానితులతో గవర్నర్ భేటీ అవుతారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర బాధ్యులు  కన్నా లక్ష్మి నారాయణ ,  ఇతర నాయకులు బిశ్వభూషణ్ ను కలిసే శుభాకాంక్షలు అందిస్తారు. వివిధ పార్టీల నేతలు, స్వచ్ఛంధ సంస్ధల ప్రతినిధులు ఈ వేడుకలలో అంతర్భాగం కానున్నారు.