శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 29 జులై 2019 (18:35 IST)

మహిళల సామాజిక ఉన్నతికి ప్రభుత్వ తోడ్పాటు అత్యావశ్యకం.. ఆంధ్రప్రదేశ్ గవర్నర్

మహిళల భద్రత, సామాజిక ఉన్నతికి సంబంధించి ప్రభుత్వ పరమైన తోడ్పాటు మరింత అవసరమని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ అభిప్రాయపడ్డారు. ఇందుకు ఎన్జీవోల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాలలో చిన్నారులు, తల్లులకు మంచి పోషకాహారం అందించినప్పుడే ఆరోగ్యకరమైన భావి భారత పౌరులను ఈ దేశం చూడగలుగుతుందని గవర్నర్ పేర్కొన్నారు.

సోమవారం రాజ్‌భవన్‌లో మహిళా, శిశు, విగలాంగుల సంక్షేమ  శాఖ అమలు చేస్తున్న విభిన్న కార్యక్రమాలను గురించి గవర్నర్ తెలుసుకున్నారు. శాఖ ముఖ్య కార్యదర్శి దమయంతి, కమీషనర్ కృతిక శుక్లా తదితరులు ప్రభుత్వ పరంగా అమలవుతున్న వివిధ పధకాలను గురించి గవర్నర్ కు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని తెలిపారు.

గవర్నర్ పలు సూచనలు చేస్తూ మహిళల భద్రత,  ఇతర అంశాలకు సంబంధించి వారికి ఏక గవాక్ష విధానంలో సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. రానున్న రోజుల్లో వృద్ధుల సంక్షేమ గృహాలను సందర్శించేందుకు రావాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు గవర్నర్ కు విన్నవించగా ఆయన అందుకు అంగీకరించారు. గవర్నర్ సూచనల మేరకు తాము ముందడుగేస్తామని  ఇందుకు వారి సందర్శన ఎంతో ఉపయోగపడుతుందని సందర్భంగా కృత్తికా శుక్లా అన్నారు.

మరోవైపు గవర్నర్ అధ్యక్షుని గా ఉన్న ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీ బాధ్యులు కూడా ఆయనతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో రెడ్ క్రాస్ చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ మాట్లాడుతూ అన్ని దానాలలో కెల్లా జీవితాలను కాపాడే రక్తదానం ఎంతో గొప్పదని, దానిని ప్రోత్సహించాలని సూచించారు. సేవా కార్యక్రమాలకు దాతలు పెద్ద ఎత్తున ముందుకు వస్తారని, అయితే దాతృత్వం సద్వినియోగం అవుతుందన్న భావనను కలిగించవలసి ఉంటుందని వివరించారు.

విపత్కర పరిస్ధితులలో రెడ్ క్రాస్ సేవలను ఏలా అందించగలుగుతున్నారన్న దానిపై సంస్థ అధ్యక్ష కార్యదర్శులు రేచల్ చటర్జీ, బాల సుబ్రహ్మణ్యం గవర్నర్ కు వివరించారు. ఈ నేపథ్యంలో 1999 నాటి భారీ తుఫానును గవర్నర్ గుర్తుచేసుకుంటూ ఒరిస్సాలో 14 జిల్లాలు ఆనాడు అతాకుతలం అయ్యాయని,  ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాలలో రెడ్ క్రాస్  ప్రత్యేక సేవలను అందించాలని విశ్వ భూషణ్ హరి చందన్ ఆకాంక్షించారు. సమావేశంలో గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, రాజ్ భవన్ జాయింట్ సెక్రటరీ అర్జున్ రావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అనంతరం వివిధ విశ్వవిధ్యాలయాల ఉపకులపతులు గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిసారు. గవర్నర్ ను కలిసిన వారిలో  నెల్లూరు విక్రమ సింహపురి విసి ఆచార్య సుదర్శన రావు, అనంతపురం జవహర్ లాల్ నెహ్రు సాంకేతిక విశ్వవిద్యాలయం విసి డాక్టర్  ఎస్ ఎస్ కుమార్ , తిరుపతి వెంకటేశ్వరా వేద విశ్వవిద్యాలయం విసి సుదర్శన శర్మ, అచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విసి అచార్య దామోదర నాయుడు తదితరులు పాల్గొన్నారు.