బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 14 డిశెంబరు 2020 (08:29 IST)

రేషన్‌ బియ్యం డోర్‌ డెలివరీకి ఏర్పాట్లు వేగవంతం

రేషన్‌ బియ్యం, ఇతర నిత్యావసర సరుకుల్ని లబ్ధిదారుల ఇళ్లకే తీసుకెళ్లి అందించేందుకు ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. బియ్యం, సరుకుల్ని ఇంటింటికీ తీసుకెళ్లేందుకు ఉపయోగించే మినీ ట్రక్కులను నిరుద్యోగుల ద్వారా కొనుగోలు చేయించి.. వారికి ఉపాధి కల్పించేందుకు నిర్ణయించిన ప్రభుత్వం వాటి లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసింది.

ఈ నెల 4న అధికారులు జిల్లాల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహించి మినీ ట్రక్కులు పొందేందుకు లబ్ధిదారుల జాబితాలను తయారు చేశారు. ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాలపై జిల్లా కలెక్టర్లు ఆమోదముద్ర వేసి ఆయా జిల్లాల ఇన్‌చార్జ్‌ మంత్రులకు పంపించారు. ఇన్‌చార్జ్‌ మంత్రి అప్రూవల్‌ చేయగానే జాబితాలను రాష్ట్రస్థాయి అధికారులకు పంపిస్తారు.

రాష్ట్ర కార్యాలయం ఆమోదించిన తరువాత ముఖ్య కార్యదర్శికి జాబితా పంపిస్తారు. వారి నుంచి అనుమతి రాగానే తిరిగి జిల్లాకు జాబితాలు వెళతాయి. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మినీ ట్రక్కులను కేటాయించారు.

వాటిని కొనుగోలు చేసేందుకు ఆయా కార్పొరేషన్ల ఈడీలు బ్యాంకర్లతో మాట్లాడి ఎంపికైన లబ్ధిదారులకు రుణాలు ఇప్పిస్తారు. లబ్ధిదారులతో ట్రక్కుల్ని కొనుగోలు చేయించిన వెంటనే వాటిని సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ ద్వారా ఇంటింటికీ బియ్యం, ఇతర నిత్యావసర సరుకుల్ని రవాణా చేసేందుకు వినియోగిస్తారు.

బ్యాంక్‌ రుణాల్ని లబ్ధిదారుల తరఫున 72 వాయిదాల్లో సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ నేరుగా బ్యాంకులకు చెల్లిస్తుంది. లబ్ధిదారులకు బ్యాంక్‌ రుణంతోపాటు అన్ని ఖర్చులు పోను రూ.10 వేల చొప్పున చెల్లిస్తారు. 72 నెలల అనంతరం సదరు వాహనం లబ్ధిదారు సొంతమవుతుంది.