సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 7 జూన్ 2020 (18:58 IST)

ఏపీలో బియ్యం డోర్‌ డెలివరీకి రేపు ట్రయల్‌రన్

ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. సెప్టెంబర్‌ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన బియ్యం లబ్ధిదారులకు డోర్‌ డెలివరీ చేయనున్న నేపథ్యంలో సోమవారం మొబైల్‌ యూనిట్ల ట్రయల్‌రన్‌ చేయనున్నారు.

అధికారంలోకి వస్తే నాణ్యమైన, తినగలిగే బియ్యాన్ని డోర్‌ డెలివరీ చేస్తామని ఎన్నికల సమయంలో వైఎస్‌ జగన్ ‌మోహన్ ‌రెడ్డి పేదలకు హామీ ఇచ్చారు.

ఈ హామీ అమలులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు లబ్ధిదారులకు బియ్యాన్ని డోర్‌ డెలివరీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ ప్రత్యేకంగా మొబైల్‌ యూనిట్లను అందుబాటులోకి తీసుకువస్తోంది.

ఇప్పటికే తయారు చేసిన కొన్ని యూనిట్లను సోమ‌వారం ట్రయల్‌ రన్‌ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ ఎక్స్‌అఫీషియో కార్యదర్శి కోన శశిధర్‌ వెల్లడించారు.

లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా 13,370 మొబైల్‌ యూనిట్లను అందుబాటులోకి తెచ్చేందుకు టెండర్లను పిలుస్తామని తెలిపారు. నాణ్యమైన బియ్యం డోర్‌ డెలివరీ విధానం ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో అమలు చేస్తున్న విషయం తెలిసిందే. 
 
మొబైల్‌ యూనిట్‌ వల్ల ప్రయోజనం... 
* ఇందులోనే ఎలక్ట్రానిక్‌ వేయింగ్‌ మెషిన్‌ ఉంటుంది. 
* మొబైల్‌ యూనిట్ల ద్వారా ఇంటికివెళ్లి నాణ్యమైన బియ్యాన్ని డోర్‌ డెలివరీ చేస్తారు. 
* లబ్ధిదారుల ముందే బియ్యం బస్తా సీల్‌ ఓపెన్‌ చేసి రేషన్‌ ఇస్తారు. 
* బియ్యం తీసుకునేందుకు ప్రత్యేకంగా తయారు చేయించిన బ్యాగులను ముందే ఇవ్వనున్నారు.