మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 11 మే 2020 (08:31 IST)

మద్యం డోర్ డెలివరీ.. మోసపోవద్దండీ..!

సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. కిక్కు కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన మందుబాబులు మద్యం దుకాణాల వద్ద బారులు తీరారు.

అయితే కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మాత్రమే మద్యం విక్రయాలకు పచ్చజెండా ఊపిన ప్రభుత్వం రెడ్ జోన్లలో మద్యం విక్రయాలకు నో చెప్పింది. విజయవాడలో కరోనా వైరస్ ఎక్కువగా ఉన్నందున నగరంలో మద్యం షాపులు తెరుచుకోలేదు.

రెడ్ జోన్ కారణంగా నిషాకి నోచుకోని నగరవాసుల కోసం సామాజిక మాధ్యమాల ద్వారా ఓ బంపర్ ఆఫర్ అందుబాటులోకొచ్చింది. నగరంలో మీరు ఎక్కడ నివసిస్తున్నా మీ ఇంటి వద్దకే మీరు కోరుకున్న మద్యం తెచ్చిస్తామని ఆ బంపరాఫర్ సారాంశం.

ప్రకటనలో పేర్కొన్న నంబరుకు ఫోన్ చేసి ఏ బ్రాండ్ కావాలో చెప్తే.. రేటెంతో చెప్పేస్తారు. గూగుల్ పే ద్వారా సగం ధర చెల్లిస్తే, మిగతా మొత్తం డెలివరీ సమయంలో చెల్లించొచ్చు. గూగుల్ పే చేసి లొకేషన్ పంపిస్తే మందు బాటిల్ ఇంటికొచ్చి చేరుతుంది.

ఆగండాగండి.. ఇదంతా చదివి మద్యం కోసం ఆన్లైన్ లో ఆర్డర్ చేద్దామనుకుంటే మీ చేతి చమురు వదలడం ఖాయం. నగరంలోని ప్రముఖ మద్యం దుకాణాల పేరుతో మాయ మందు దందా సాగిస్తున్న ఆన్లైన్ మోసగాళ్ల ముఠా సభ్యులు మందుబాబుల బలహీనతను సొమ్ము చేసుకోవడానికి వినూత్నమైన పద్ధతులను అవలంభిస్తున్నారు.

ఫేస్ బుక్, వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా అమాయకులైన మందుబాబులను టార్గెట్ చేస్తున్నారు.  ఆంక్షలున్నా మద్యం దొరుకుతోందనీ, మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే వస్తోందని టెంప్టయ్యారో.. మీరు మోసపోయునట్లే!

మద్యం డోర్ డెలివరీ పేరుతో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ఈ మాయ మందు ముఠాపై పోలీసు అధికారులు దృష్టి సారించి, మోసగాళ్ల బారిన పడకుండా మందుబాబులను కాపాడాల్సివుంది.