ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 29 మే 2020 (07:53 IST)

నూతన ఓఈఆర్ పద్ధతుల్లోనే కొనుగోలు ధరలు: వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు

రైతు సంక్షేమం కోసం నిలబడే ప్రభుత్వం తమదని రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. సచివాలయంలోని తన కార్యాలయం ముందున్న పచ్చిక ఆవరణలో మంత్రి మీడియాతో మాట్లాడారు. దేశంలో ఆయిల్ ఫామ్ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నట్లు పేర్కొన్నారు.

గత కొంత కాలంగా ఆయిల్ ఫామ్ రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిన తరుణంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపి ఆదుకున్న విషయాన్ని మంత్రి కన్నబాబు గుర్తు చేశారు. ఈ మేరకు ఆయిల్ ఫామ్ ఫ్రైస్ ఫిక్సేషన్ కమిటీతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.

ఈ సమావేశంలో కంపెనీ యాజమాన్యం, రైతు ప్రతినిధులు, పెదవేగి ఆయిల్ ఫామ్ కు కొత్తగా నియమించిన ఛైర్మన్, ఉన్నతాధికారులు పాల్గొన్నట్లు మంత్రి వెల్లడించారు. సమావేశంలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించిన విధంగా ఆయిల్ ఫామ్ రైతులకు మేలు చేయాల్సిన వైఖరిని ఈ సమావేశంలో కంపెనీ యాజమాన్యాలకు తెలియజేశామన్నారు.

తమ ప్రభుత్వం నూటికి నూరుశాతం రైతు సంక్షేమం కోసం నిలబడుతుందన్నారు. రైతుకే తొలి ప్రాధాన్యత తప్ప మరో ప్రాధాన్యత లేదనేది ముఖ్యమంత్రి నిర్ణయమని మంత్రి  స్పష్టం చేశారు. రైతులకు మేలు చేయాలని ఇందుకోసం  ప్రభుత్వం అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటుందన్నారు.

ఆయిల్ ఫామ్ రైతుల పంటలకు ఇప్పుడిస్తున్న ధర తక్కువగా ఉందని, తెలంగాణా ఓఈఆర్ రేటు కన్నా మన ఓఈఆర్ రేటు తక్కువగా  ఉండటం వలన మన రాష్ట్ర  రైతులు నష్ట పోతున్న  పరిస్థితి ఉందనే విషయాన్ని ఆ సంస్థలకు చెప్పామన్నారు.

గతేడాది  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఇచ్చిన మాట ప్రకారం రూ.84 కోట్లు ఆయిల్ ఫామ్ రైతులకు చెల్లించి, తెలంగాణాకు, ఆంధ్రాకు ఉన్న ఓఈఆర్ శాతం ఆ గ్యాప్ ను సరిచేసిన విషయాన్ని గుర్తుచేశారు.

అదే విషయాన్ని ఇప్పడు చెబుతూ ఇంకా పాత పద్ధతిలోనే ఓఈఆర్ లను పరిగణలోకి తీసుకొని  ఆ రేటును ఫిక్స్ చేయడం మంచి పద్ధతి కాదని మంత్రి హితవు పలికారు. కొత్తవిధానం కావాలని, కొత్త విధానంలో తమ ప్రభుత్వం రేటును ఫిక్స్ చేస్తుందన్నారు. అది తెలంగాణతో సమానమైన ఓఈఆర్ తీసుకోవాలా, మరోక విధానం ఏదైనా తీసుకోవాలా అనే అంశంపై చాలా సేపు చర్చించామన్నారు.

ప్రభుత్వం ఏదైతే గట్టిగా నిర్ణయం తీసుకుందో దాన్ని ఇప్పటికే కంపెనీల యాజమాన్యాలకు తెలియజేయడం జరిగిందన్నారు. ఆ నిర్ణయం ప్రకారం  కంపెనీలు ముందుకు రావాలని చెప్పామన్నారు. అదే విధంగా కంపెనీలు ఇప్పుడున్న జోనల్ విధానంలో కాకుండా, ఒక జోన్ లో నుంచి వేరొక జోనల్ లోకి వెళ్ళి ఆయిల్ ఫామ్ గెలలను కొంటున్నారని తెలిసిందన్నారు.

ఇది మంచి పద్దతి కాదని, అలా చేయడం వలన ప్రభుత్వ విధానం పాడువుతుందని తెలియజేశామన్నారు. కంపెనీల యాజమాన్యాలు ఆ విధంగా చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని తెలిపామన్నారు. దీంతో పాటు ఈ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, కనుక కంపెనీ యాజమాన్యాలు ఇచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకొని కొత్త విధానం తీసుకోబోతున్నామన్నారు. కంపెనీల యాజమాన్యాలు  తక్షణం స్పందించాలని కోరినప్పడు, ప్రతినిధులు తమకు 3,4 రోజులు సమయం కావాలని కోరారన్నారు.

దీనికి తాము కూడా అంగీకరించగడం జరిగిందన్నారు. ఆ తరువాత వారితో మాట్లాడి ఒక స్పష్టమైన విధానం తీసుకువస్తామని మంత్రి స్పష్టం చేశారు.ఆయిల్ ఫామ్ రైతులకు మేలు చేస్తామని గతంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను మంత్రి గుర్తుచేశారు. గత సంవత్సరంలో ఆయిల్ ఫామ్ ధర సగటు రేటు తీసుకుంటే దాదాపు రూ.9,500లు ఏపీలో వచ్చిందన్నారు.

తెలంగాణతో పోలిస్తే ఈ ధర ఒక వెయ్యి రూపాయలు తక్కువగా ఉందన్నారు. సిఎసిపి నిర్ణయం ప్రకారం ఎంఎస్పీ రూ.10,036 లు ఇవ్వాలనేది ఒక డిమాండ్ చాలా కాలంగా దేశ వ్యాప్తంగా నడుస్తుందని మంత్రి తెలిపారు.

సిఎం జగన్ సంబంధిత రైతుల డిమాండ్ ను సమర్ధిస్తూ కేంద్రానికి లేఖ రాయడం జరిగిందని తెలిపారు.ఆయిల్ ఫామ్ రైతులను తప్పకుండా ఆదుకుంటామని భరోసానిచ్చారు. ఆయిల్ ఫామ్ రైతాంగాన్ని ఆదుకునే విషయంలో ఎటువంటి సందేహం లేదని మరోసారి స్పష్టం చేశారు.