గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 17 జులై 2021 (08:54 IST)

పుష్పపల్లకీపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారి ద‌ర్శ‌నం

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఆణివార ఆస్థానం సందర్భంగా శుక్ర‌వారం సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్పపల్లకీపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు ద‌ర్శ‌న‌మిచ్చారు. చిరుజల్లుల  నడుమ పుష్పపల్లకీ సేవ సాగింది.
 
ఆరు ర‌కాల సంప్ర‌దాయ పుష్పాలు, ఆరు ర‌కాల క‌ట్ ఫ్ల‌వ‌ర్లు క‌లిపి దాదాపు ఒక ట‌న్ను పుష్పాల‌తో హంస ఆకారంలో ప‌ల్ల‌కీని అలంక‌రించారు. ప‌ల్ల‌కీ ముందు వైపు శ్రీ‌రాముడు, శ్రీకృష్ణుడు, మ‌ధ్య భాగంలో చిన్నికృష్ణుడు, వెనుక‌వైపు బాల ఆంజ‌నేయ‌స్వామివారి ఆకృతుల‌ను రూపొందించారు. 15 మంది అలంకార నిపుణులు 3 రోజుల పాటు శ్ర‌మించి ఈ పుష్ప‌ప‌ల్ల‌కీని త‌యారుచేశారు.
 
టిటిడి స్థానికాల‌యాల్లో శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానం
తిరుప‌తి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యం, శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యాల‌లో శుక్ర‌వారం సాయంత్రం ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా జ‌రిగింది.

ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో దీనికి ఆణివార ఆస్థానం అని పేరు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినంనాటి నుండి టిటిడి వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు, వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టిటిడి ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి - ఏప్రిల్‌ నెలలకు మార్చారు.
 
శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యం
శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలోని బంగారు వాకిలి వ‌ద్ద శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారిని వేంచేపు చేసి సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు ఆస్థానం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా శ్రీ పుండ‌రీక వ‌ల్లి అమ్మ‌వారి ఆల‌యం నుండి నూత‌న వ‌స్త్రాల‌ను విమాన ప్ర‌ద‌క్ష‌ణ‌గా తీసుకువ‌చ్చి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారికి స‌మ‌ర్పించారు.