సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 24 జులై 2019 (15:55 IST)

మాటు వేసి... బాలుడి కిడ్నాప్... జల్లెడ పడుతున్న పోలీసులు

పథకం ప్రకారం మాటువేసి ఓ బాలుని గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మండపేట విజయలక్ష్మి నగరులో నాయనమ్మతో కలసి వాకిoగ్ చేసి ఇంటిమెట్లు ఎక్కుతుండగా జషిత్ అనే నాలుగేళ్ళ బాలుడిని గుర్తు తెలియని దుoడగుడు బైక్‌పై వచ్చి నాయనమ్మను కొట్టి ఎత్తుకు పోయారు. ప్రశాంతంగా ఉండే మండపేటలో కిడ్నాప్ సంఘటన వులిక్కిపడినట్లుగా చేసింది. 
 
స్థానిక విజయలక్ష్మి నగర్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం స్థానిక యూనియన్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం నిర్వహిస్తున్న నూక వెంకటరమణ కుమారుడు జషిత్(4)ను నాయనమ్మ పార్వతి సమీపంలోని అపార్టుమెంట్ వద్దకు ఆదుకునేందుకు తీసుకుని వెళ్ళింది. అక్కడ నుండి తాము నివసిస్తున్న విజయలక్ష్మి నగర్ శశి స్కూల్ ప్రధాన రహదారిలోని శ్రీ సాయి ధరణి ప్లాజాకు చేరుకునేసరికి సినీఫక్కీలో ఓ ఆగంతకుడు ఆమెను కరెంటు ఉందా అంటూ ప్రశ్నించాడు. వెను వెంటనే ఆమెపై పిడిగుద్దులు గుద్ది గాయపర్చాడు. 
 
వెంటనే బాలుడిని ఎత్తుకుని మోటర్ సైకిల్‌పై బాబు‌ను ఎత్తుకెళ్లాడు. కొద్దిదూరం పరుగులు తీసిన పార్వతి పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు గుమిగుడారు. విషయం తెలుసుకుని వెంటనే బైపాస్ రోడ్‌లో వెళ్లారు. మోటార్ సైకిల్ వేగంగా ఆలమూరు రోడ్డు వైపుకు వెళ్లడాన్ని గమనించిన వారు వాహనాన్ని వెంబడించారు. అయితే టోల్ గేట్ వద్ద లారీ అడ్డురావడంతో క్షణాల్లో వారు మాయమయ్యారు. సమాచారం అందుకున్న టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
 
దీంతో పోలీసులు ఎలార్ట్ అయ్యారు. ప్రతిచోటా జల్లెడ పడుతున్నారు. ఒక్క ప్రాంతాన్ని కూడా వదలకుండా సోదాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. దీంతో బాలుడి ఆచూకీ కనుగొనేందుకు రామచంద్రపురం డిఎస్పీ జెవి సంతోష్ నేతృత్వంలో రూరల్ సిఐ మంగాదేవి, టౌన్,రూరల్ ఎస్‌ఐలు రాజేష్ కుమార్, దొరరాజులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బాలుడి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వారి నుంచి వివరాలు రాబట్టల్సివుంది. ఎవరైనా తెలిసిన వారే కిడ్నాప్ చేసి ఉంటారని భావిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల నుంచి పోలీసులు వివరాలు సేకరించారు.
 
శ్రీకాకుళం నుండి వచ్చి.... 
ప్రశాంతతకు పెట్టింది పేరు మండపేట. ఇక్కడ నివసిస్తున్న వారు ఈ పట్టణాన్ని వదిలి వెళ్ళేందుకు ఇష్టపడారు. అలాంటి పట్టణంలో కిడ్నాప్ కలవరపాటుకు గురిచేసింది. శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన భార్య భర్తలు చెరో బ్యాంకులో ఉద్యోగాలు చేస్తూ ఆనందంగా జీవిస్తున్న తరుణంలో ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది. నూక వెంకట రమణది శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం కనుగులవలస స్వస్థలం. ఉద్యోగంలో స్థిరపడ్డ అనంతరం శ్రీకాకుళం పట్టణంలో ఇల్లు నిర్మించుకున్నారు. 
 
ఆరు నెలలు క్రితం మండపేట యూనియన్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా వచ్చారు. ఈయన భార్య బెండీ నాగావళి కూడా స్థానిక కెనరా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజరుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి నాలుగేళ్ళ జషిత్ వున్నాడు. కాగా ఆమె ఇప్పుడు నిండు గర్భిణీ. ఆనందంగా సాగిపోతున్న వీరి జీవితంలో కిడ్నాప్ కన్నీళ్లు రప్పిస్తుంది. 
 
ముద్దులు ఒలికించే జషిత్ అంటే అక్కడి అపార్టుమెంట్లు వారందరి ఎంతో ఇష్టం. అలాంటి చిన్నారి కిడ్నాప్ కావడంతో వారంతా ఆందోళనకు గురయ్యారు. ఇరువురి బ్యాంకు సహా ఉద్యోగులు అక్కడికి చేరుకుని వారిని ఓదరించారు. తన కుమారుడు ఆచూకీ కోసం ఆ తల్లి తల్లడిల్లడం చూపరులను సైతం కంట కన్నీరు రప్పించింది. బాలుడి ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని డీఎస్పీ కోరారు.