టిక్ టాక్ ప్రేమ.. వివాహితను వాడుకునే వరకు వచ్చింది..పెళ్లి అనేసరికి?
సోషల్ మీడియా యాప్‌ల ద్వారా ప్రేమించుకోవడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ఇంతవరకు ఫేస్‌బుక్, వాట్సాప్ ద్వారా ప్రేమాయణాలు చిగురించేవి. ప్రస్తుతం సీన్ టిక్ టాక్ వరకు వచ్చింది. తాజాగా ఓ టిక్ టాక్ ప్రేమ కథ మోసానికి దారితీసింది. వివరాల్లోకి వెళితే.. తాను పెడుతున్న వీడియోలను తెగ లైక్ చేస్తున్న ఓ వ్యక్తిని ప్రేమించిన వివాహిత యువతి దారుణంగా మోసపోయింది.
హైదరాబాదులో భర్తతో విభేదాలు తలెత్తడంతో అతనికి దూరంగా వుంది. ఆ వివాహిత, టిక్ టాక్ యాప్‌లో వీడియోలను అప్ లోడ్ చేస్తుండగా, ఓ వ్యక్తి ఆమె హావభావాలకు లైక్‌లు కొట్టాడు. దీంతో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఉద్యోగం లేకుండా జులాయిగా తిరుగుతున్న ఆ వ్యక్తి ప్రేమ, పెళ్లి అంటూ ఆమెను నమ్మించాడు.
చివరికి పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలు మాదాపూర్ పోలీసులను ఆశ్రయించింది. తనకు పెళ్లయిందని, ఇద్దరు పిల్లలున్నారని, అయినా పెళ్లి చేసుకుంటానని చెప్పి, తనను వాడుకున్నాడని.. ఇప్పుడు మొహం చాటేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.