శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 25 ఫిబ్రవరి 2017 (03:28 IST)

ఒకరిది మానవత్వం మరొకరిది జాతిద్వేషం వెరసి నిండుప్రాణం బలి.. ఎన్నాళ్లిలా

మానవత్వం అక్కడే గుబాళిస్తోంది. ఎంతగా అంటే తమ అధ్యక్షుడినే ధిక్కరించేంతగా, ఏడు ముస్లిం దేశాల పౌరులను అమెరికాలోకి రానివ్వకుండా దేశాధ్యక్షుడు డిక్రీ జారీ చేస్తే లక్షలాది మంది ప్రజలు రోజుల తరబడి దేశమంతటా నిరసన తెలిపేంత స్థాయి మానవత్వం అది.

మానవత్వం అక్కడే గుబాళిస్తోంది. ఎంతగా అంటే తమ అధ్యక్షుడినే ధిక్కరించేంతగా, ఏడు ముస్లిం దేశాల పౌరులను అమెరికాలోకి రానివ్వకుండా దేశాధ్యక్షుడు డిక్రీ జారీ చేస్తే లక్షలాది మంది ప్రజలు రోజుల తరబడి దేశమంతటా నిరసన తెలిపేంత స్థాయి మానవత్వం అది. ఎక్కడో పరాయి దేశాల నుంచి వచ్చిన వారు నిరంకుశ చట్టాలకు బలవుతుంటే చూసి సహించలేక తమ అధ్యక్షుడినే ఈసడించుకుని నువ్వు పనికిరావు పో.. అని తూలనాడేంత మానవత్వం వారి సొత్తు. అదే గడ్డపై జాతి ద్వేషమూ పొంగుతుంది. బయటి దేశాల వారు తమ అవకాశాలు కొల్గగొట్టుకుపోతున్నారంటూ దేశాధ్యక్షుడే స్వయంగా విషం చిమ్మినప్పుడు, ఆ ప్రబావం ఎంతో కొంత పనిచేస్తున్న దురదృష్టకర క్షణాల్లో జాతి ద్వేషమూ అక్కడే విచ్చలవిడిగా పెరుగుతోంది. ఫలితం మెరుగైన జీవితం కోసం దేశాలు దాటి వలసపోయి కిందా మీదా పడుతున్న అమెరికన్ భారతీయుల రక్తం చూస్తున్న జాతిద్వేషం ఇప్పుడు అెమెరికా సొంతం. ఆ ద్వేష జ్వాలలకు మన తెలుగు యువకులే బలకావడం మరీ దురదృష్టం.
 
‘మా ఉద్యోగాలు మాకే..’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల్లో ఇచ్చిన నినాదం వెర్రితలలు వేస్తోందా గద్దెనెక్కాక ఆయన తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు అమెరికాలో జాత్యహంకార భావజాలానికి మరింత ఊతమిస్తున్నాయా కన్సాస్‌లో ఇద్దరు తెలుగు ఇంజనీర్లపై జరిగిన కాల్పుల ఘటన చూస్తుంటే ఇది నిజమేనని అన్పిస్తోంది! బార్‌లోకి వచ్చిన అమెరికన్‌.. జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తూ ఇంజనీర్లపై కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో అమెరికాలో ఉంటున్న భారతీయులు ముఖ్యంగా తెలుగువారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
 
హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్, మేడసాని అలోక్‌రెడ్డి అమెరికాలోని కన్సాస్‌ రాష్ట్రంలో ఉన్న ఓవర్‌ల్యాండ్‌ పార్క్‌లో నివసిస్తున్నారు. జీపీఎస్‌ వ్యవస్థలను తయారు చేసే గార్నిమ్‌ అనే సంస్థలో ఉద్యోగం నిర్వస్తున్నారు. ఇద్దరూ మంచి స్నేహితులు కూడా. ఇద్దరూ కలసి బుధవారం రాత్రి అక్కడి ఒథాలే ప్రాంతంలోని ఆస్టిన్స్‌ బార్‌కు వెళ్లారు. కొంతసేపటి తర్వాత పూరింటన్‌ అనే అమెరికన్‌ వారి వద్దకు వచ్చి వాదనకు దిగాడు. తాము (అమెరికన్లు) మేధావులమేనని, తమకు ప్రతిభ ఉన్నా విదేశాల వారి కారణంగా తమకు ఉద్యోగాలు రావట్లేదని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘మీరు మా ఉద్యోగాలను కాజేస్తున్నారు. తక్షణం అమెరికా విడిచివెళ్లిపోండి. ఉగ్రవాదులు.. మీరు నాకంటే ఎలా ఎక్కువ అమెరికాలో ఎందుకుంటున్నారు, ఏం చేస్తున్నారు..’అంటూ గొడవకు దిగాడు. దీంతో శ్రీనివాస్, అలోక్‌రెడ్డిలు బార్‌ మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. అక్కడికి వచ్చిన బార్‌ మేనేజర్, సిబ్బంది పూరింటన్‌ను బయటికి పంపేశారు.
 
బార్‌ నుంచి బయటికి వెళ్లగొట్టినా.. పూరింటన్‌ కొద్దిసేపటికి తుపాకీతో తిరిగి వచ్చాడు. ‘మా దేశం విడిచి వెళ్లిపోండి.. ఉగ్రవాదులారా..’ అని అరుస్తూ శ్రీనివాస్, అలోక్‌రెడ్డిలపై కాల్పులు జరిపాడు. శ్రీనివాస్‌ ఛాతీలో బుల్లెట్‌ దిగడంతో అక్కడే కుప్ప కూలిపోయారు. అలోక్‌కి తొడ భాగంలో తూటా దూసుకుపోయింది. ఈ సమయంలో అక్కడే ఉన్న ఇయాన్‌ గ్రిలట్‌ అనే మరో అమెరికన్‌.. పూరింటన్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. దాంతో అతడి చేతిపై బుల్లెట్‌ గాయమైంది. వారందరినీ వెంటనే ఆస్పత్రికి తరలించగా.. శ్రీనివాస్‌ అప్పటికే మరణించారు. అలోక్‌రెడ్డి, ఇయాన్‌ గ్రిలట్‌లు చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక జాతి, మత విద్వేష నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన ఈ కాల్పుల ఘటన భారతీయ అమెరికన్లలో భయాందోళన నింపుతోంది.