రెండో భార్య కుమార్తెపై అత్యాచారం చేసిన మారుతండ్రి
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. రెండో భార్య కుమార్తెపై మారుతండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గోల్కొండ ప్రాంతంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గోల్కొండ ప్రాంతానికి చెందిన వ్యక్తి (45) ఓ మహిళను రెండో వివాహం చేసుకున్నాడు.
ఆమెకు మొదటి భర్తతో పుట్టిన కుమార్తె(13) నగరంలో ఓ ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతోంది. ఆదివారం సెలవు కావడంతో ఇంటికి వెళ్లిన బాలికపై మారు తండ్రి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత విషయం బయటకు చెబితే మీ అమ్మతో పాటు నిన్నుకూడా చంపేస్తానని బెదిరించాడు. కానీ ఆ యువతి ముభావంగా ఉండటాన్ని గమనించిన తల్లి నిలదీయడంతో అసలు విషయం చెప్పింది.
ఈ విషయం ఇరుగుపొరుగువారి ద్వారా బాలల హక్కుల సంఘానికి తెలిసింది. దీంతో బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు అక్కడకు చేరుకుని వివరాలు సేకరించి గోల్కొండ ఇన్‌స్పెక్టర్ కొమరయ్యకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.