శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Updated : సోమవారం, 25 మే 2020 (19:58 IST)

తూర్పు గోదావరిలో పశువులను తింటున్న వింత జంతువు

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం పెనికేరులో వింత జంతువు సంచారం కలకలం రేపుతుంది. రోజు రాత్రి సమయంలో పొలాల్లో ఉన్న పశువులను చంపేస్తుంది. 
ఇప్పటివరకు 20కి పైగా పశువులు మృతి చెందడంతో నిద్రహారాలు మాని రైతులు 
రాత్రి అంతా పొలాల్లోనే గడుపుతున్నారు.
 
తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గం పరిధిలో వింత జంతువు సంచారం కలకలం రేపుతుంది. రోజూ రాత్రి వేళల్లో  లేగదూడల్ని చంపేస్తుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 పశువులను పొట్టన పెట్టుకుంది. దీనితో పాడి రైతుల్లో  భయాందోళనలు నెలకొన్నాయి. ఈ వింత జంతువుని ఎవరూ చూడలేదు. పాడి పశువులు, లేగదూడలను చంపి తిని వేయడంతో, ఇది చిరుతా లేక ఇతర జంతువులా అన్న అనుమానం ఉంది.
 
మూకుమ్మడిగా నక్కలు దాడి చేసి ఉండవచ్చనే అనుమానం కలుగుతుంది. పెనికేరు, నవాబుపేట, జొన్నాడ ఈ ప్రాంతాల మధ్యలోనే రాత్రి వేళల్లో సంచరిస్తుంది. ఇటీవల పెనికేరు గ్రామానికి చెందిన కోన శేషయ్య, కోటిపల్లి వెంకన్న, సిరిపాదం వెంకటరమణకు చెందిన లేగదూడలను చంపేసింది. అలాగే జొన్నాడ గ్రామానికి చెందిన రైతు దూడను గాయపరచి దూడ తోకను తినేసింది.
 
ఇలా లేగదూడలను చంపేస్తున్న జంతువు ఏమిటన్నది ఇంతవరకు అంతుచిక్కలేదు. కొందరు చిరుత అని మరికొందరు వింత జంతువని, ఇంకొందరు నక్కల గుంపు అని చెబుతున్నారు. దీంతో రైతులంతా రాత్రి సమయంలో కంటమీద కునుకు లేకుండా మకాంల వద్ద కాపలా కాస్తున్నరు పాడి రైతులు. దీనితో అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
 
వింత జంతువును పట్టుకుని పశువులను కాపాడాలని వేడుకుంటున్నారు. ఈ జంతువు బారిన పడి అనేక లేగదూడలు బలవుతున్న నేపథ్యంలో రక్షణ కల్పించాలని పెనికేరు, నవాబుపేట, జొన్నాడ గ్రామాల పాడి రైతులు కోరుతున్నారు. ప్రతిరోజు లేగదూడలను చంపేస్తున్న సంఘటనలు వెనుక దాగివున్న రహస్యాన్ని పరిష్కరించాలని, మృతి చెందిన లేగదూడల యజమానులకు పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.