తూగోలో దారుణం : కోడికూర వండలేదని కొట్టి చంపేశాడు...
ఒకవైపు కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టిముట్టింది. ఈ వైరస్ దెబ్బకు ప్రజలంతా హడలిపోతున్నారు. దీంతో ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్ళకే పరిమితమవుతున్నారు. ఇంకొందరు మగరాయుళ్లు మాత్రం ఈ మహమ్మారి ప్రమాదాన్ని ఏమాత్రం గుర్తించలేకపోతున్నారు. ఫలితంగా ఈ లాక్‌డౌన్ సమయంలోనూ నోటికి రుచికరమైన కూరల కోసం అర్రులు చాస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రోజున కోడికూర వండలేదన్న అక్కసుతో ఓ వ్యక్తి తనతో సహజీవనం చేసే మహిళను కొట్టి చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలంలోని సిరిగిందలపాడుకు చెందిన లక్ష్మి జగ్గంపేట మండలంలోని మల్లిశాలలోని ఓ జీడిమామిడి తోటలో కాపలాదారుగా పనిచేస్తోంది. సోకులగూడెం గ్రామానికి చెందిన తోకల వెంకటేశ్ కూడా అదే తోటలో పనిచేస్తున్నాడు. దీంతో గత కొంతకాలంగా ఇద్దరూ కలిసే ఉంటున్నారు. అంటే సహజీవనం చేస్తున్నారు.
శనివారం రాత్రి మద్యం మత్తులో వచ్చిన వెంకటేశ్.. మాంసం కూర ఎందుకు వండలేదని లక్ష్మితో గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో వెంకటేశ్ ఆగ్రహంతో ఊగిపోయాడు. పక్కనే ఉన్న కర్ర తీసుకుని లక్ష్మిపై దాడిచేశాడు. తీవ్ర గాయాల పాలైన లక్ష్మి ఆదివారం ఉదయం మృతి చెందింది. ఆమె కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.