1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 మార్చి 2020 (09:37 IST)

'కరోనా వైరస్' సోకకుండా ఉండాలంటే.. అదొక్కటే మార్గం...

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ మహమ్మారి కమ్మేస్తోంది. ఇందులో మన దేశం కూడా ఉంది. దీంతో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ వైరస్ బారినపడి అనేక మంది కోలుకున్నారు. ఇలా కోలుకున్న వారిలో ముంబై నగరంలోని ఘట్‌కోపర్ ప్రాంతానికి చెందిన అంజనీభాయి ఒకరు. ఈమె వయసు 65 యేళ్లు. కరోనా వైరస్ సోకడంతో మార్చి 17వ తేదీన ఆస్పత్రికి తరలించారు. 
 
అక్కడ ఐసోలేషన్ వార్డులో ఉంచి కరోనా చికిత్స చేయించుకున్నారు. ఈ చికిత్స ముగియడంతో పాటు.. కరోనా వైరస్ బారి నుంచి ఆమె పూర్తిగా విముక్తిపొందింది. దీంతో ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆ తర్వాత కరోనా వైరస్ ఎలా సోకింది? ఆస్పత్రిలో చికిత్స ఎలా జరిగింది? ఈ వైరస్ బారినపడకుండా ఉండాలంటే ఏం చేయాలి వంటి తదితర వివరాలను ఆమె వెల్లడించింది. 
 
తాను ముంబైలో ఉంటూ ఓ ఇంట్లో పని చేస్తాను. ఆ ఇంటి యజమాని అమెరికా నుంచి తిరిగి రావడంతో అతని వల్ల తనకు కరోనా సంక్రమించింది. కరోనా వచ్చినా ప్రజలు భయపడకుండా ధైర్యంగా ఉంటే అదే నయమవుతుంది. ప్రభుత్వం, పోలీసులు, వైద్యుల సూచనల ప్రకారం ఇంట్లో ఉండండి. రద్దీ ప్రదేశాలకు అస్సలు వెళ్లకూడదన్నారు. 
 
ఆసుపత్రిలో వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తనకు చికిత్సచేశారని, దానివల్లనే తాను కోలుకున్నానని చెప్పారు. మీరు ప్రభుత్వ నియమాలను పాటిస్తే, కరోనావైరస్ దగ్గరకు రాదు. ముఖ్యంగా, లాక్‌డౌన్ సమయంలో ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్ళకే పరిమితం కావాలని అంజనీభాయి సూచించారు.