గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 మార్చి 2020 (09:17 IST)

ఆదివారం రాత్రి ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదు....

మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దీని దెబ్బకు భారత్ కూడా బెంబేలెత్తిపోయింది. ఈ వైరస్ మరింతగా వ్యాపించకుండా ఉండేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. దీన్ని సంపూర్ణంగా అమలు చేస్తున్నారు. అయినప్పటికీ ఆదివారం సాయంత్రం వరకు దేశంలోని పలు ప్రాంతాల్లో అనేక కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ఆదివారం రాత్రి విడుదల చేసిన లెక్కల ప్రకారం దేశంలో మొత్తం 1139 కరోనా కేసులు నమోదైవున్నాయి. ఆదివారం ఒక్క రోజే 130 కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇంత భారీ సంఖ్యలో నమోదు కావడం ఇదే తొలిసారి. ఇందులో 27 మంది మరణించగా, 100 మందికి పైగా కోలుకున్నారు. 
 
ఈ వైద్య బులిటెన్ తర్వాత నుంచి సోమవారం ఉదయం వరకు కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అంటే.. ప్రస్తుతం ఆదివారం రాత్రి ప్రకటించినట్టుగానే దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1139గానే ఉంది. ఇది నిజంగానే శుభవార్తే. దీనికి కారణంగా పకడ్బంధీగా లాక్‌డౌన్ అమలు చేయడమే. 
 
గత రాత్రి ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ఆదివారం రాత్రికి అధికారిక లెక్కల ప్రకారం, 1139 కేసులు ఇండియాలో ఉండగా, ఈ ఉదయం కూడా రోగుల సంఖ్య అంతే ఉంది. ఈ ఉదయం 7.20 గంటలకు 'ఇండియా కోవిడ్-19 ట్రాకర్'లో పేర్కొన్న వివరాల ప్రకారం, రికవరీల సంఖ్య కూడా గణనీయంగా పెరిగి 103కు చేరుకుంది. వాస్తవానికి ఇది మరింత అధికంగా ఉండాలి. తెలంగాణలో ఆదివారం రికవరీ అయిన 11 కేసులనూ ఇందులో ఇంకా చేర్చలేదు.
 
ఈ గణాంకాల ప్రకారం, 1009 యాక్టివ్ కేసులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో చికిత్స పొందుతుండగా, 27 మంది మరణించారు. కరోనా పాజిటివ్ కేసుల విషయంలో మహారాష్ట్ర, కేరళ పోటీ పడుతూనే ఉన్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 203 కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య 7కు పెరిగింది. ఆపై రెండో స్థానంలో నిలిచిన కేరళలో 202 మందికి వ్యాధి సోకగా, ఒకరు మరణించారు.
 
ఇకపోతే, కర్ణాటకలో 83, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో 72 చొప్పున, తెలంగాణలో 70, గుజరాత్‌లో 63, రాజస్థాన్‌లో 59, తమిళనాడులో 50, మధ్యప్రదేశ్‌లో 39, పంజాబ్, జమ్మూకాశ్మీర్‌లో 38 చొప్పున, హర్యానాలో 35, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో 21 చొప్పున, బీహార్‌లో 15, లడ్డాక్‌లో 13, అండమాన్ దీవుల్లో 9, చండీగఢ్‌లో 8, చత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్‌లో 7 చొప్పున, గోవాలో 5, హిమాచల్ ప్రదేశ్, ఒడిశాల్లో 3, మణిపూర్, మిజోరం, పుదుచ్చేరిల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. 
 
ముఖ్యంగా  తమిళనాడు రాష్ట్ర పరిధిలోనే అంతర్భాగంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కేవలం ఒక్క కేసు మాత్రమే నమోదైంది. దీనికి కారణం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారాయణ స్వామితో పాటు.. లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడమే.