సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 మార్చి 2020 (09:45 IST)

కరోనా వైరస్ సోకడానికి ఆ జీవే కారణం?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మనుషులకు వ్యాపించింది. దీంతో ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య లక్షల్లో ఉంది. మృతుల కూడా వేలల్లో ఉంది. నెలల బిడ్డలకు సైతం ఈ వైరస్ సోకుతుంది. హాంకాంగ్ వంటి ప్రాంతాల్లో మనుషుల నుంచి పెంపుడు జంతువులకు ఈ వైరస్ సోకింది. పైగా, ఈ వైరస్ మహమ్మారిని నిరోధించేందుకు సరైన మందులేదు. దీంతో ప్రపంచం బంబేలెత్తిపోతోంది. 
 
అయితే, ఈ వైరస్, గబ్బిలాలు, పాముల వల్ల సంభవిస్తుందని ఇప్పటివరకు ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, ఈ వైరస్ గబ్బిలాలు, పాముల వల్ల కాదనీ, అలుగు (పాంగోలిన్) అనే జీవిద్వారా వ్యాపించినట్టు దక్షిణ చైనాకు వ్యవసాయ శాస్త్రవేత్తలు వెల్లడించారు. 
 
కరోనా బాధితులకు, అలుగు జన్యుక్రమానికి 99శాతం పోలికలు ఉన్నట్లు వారు తెలిపారు. దాదాపు 1000 జీవుల జన్యుక్రమాలతో కరోనా బాధితుల నమూనాలను పోల్చిచూసిన తర్వాత శాస్త్రవేత్తలు ఈ నిర్ణయానికి వచ్చారు. 
 
కాగా, తొలుత ఈ వైరస్ గబ్బిలాల నుంచి వ్యాప్తి చెందినట్లు భావించారు. ఎందుకంటే వీటి జన్యుక్రమంతో, కరోనా బాధితుల జన్యుక్రమం 96 శాతం సరిపోలింది. దీంతో ఈ వైరస్ నేరుగా గబ్బిలాల నుంచే వ్యాప్తి చెందిందా? లేదా మధ్యలో వేరే జీవి మాధ్యమంగా ఉందా? అనే విషయం పట్ల శాస్త్రవేత్తలు అనుమానాలు వెలిబుచ్చారు. 
 
ఇదే అంశంపై వారు పరిశోధనలు జరిపారు. ఈ పరిశోధనలో గబ్బిలాల నుంచి అలుగుకు, అలుగు నుంచి మనుషులకు సోకిందని పరిశోధకులు నిర్ధారిస్తున్నారు. ఒక్క చైనాలోనేగాక చాలా దేశాల్లో అలుగును ఆహారంగా తీసుకుంటారు. అయితే ఈ పరిశోధన శాస్త్రీయం కాదని కొందరు నిపుణులంటున్నారు.