శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 2 ఫిబ్రవరి 2018 (10:15 IST)

'చంద్రగ్రహణం' రోజున నరబలి.. మేడపై మొండెంలేని చిన్నారి తల

హైదరాబాద్ నగరంలో చంద్రగ్రహణం రోజున నరబలి జరిగినట్టు తెలుస్తోంది. ఓ క్యాబ్ డ్రైవర్ ఇంటి మేడపై మొండెం లేని ఓ చిన్నారి తల కనిపించింది. ఇది స్థానికంగా కలకలం రేపింది.

హైదరాబాద్ నగరంలో చంద్రగ్రహణం రోజున నరబలి జరిగినట్టు తెలుస్తోంది. ఓ క్యాబ్ డ్రైవర్ ఇంటి మేడపై మొండెం లేని ఓ చిన్నారి తల కనిపించింది. ఇది స్థానికంగా కలకలం రేపింది. పైగా, ఇది ఖచ్చితంగా నరబలిగానే పోలీసులు భావిస్తూ, ఆ కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ పరిధిలోని చిలుకానగర్‌కు చెందిన రాజశేఖర్ అనే వ్యక్తి కుటుంబం గురువారం ఉదయం మేడారం జాతరకు వెళ్లే క్రమంలో, ఆయన అత్త ఉతికిన బట్టలు ఆరేసేందుకు డాబాపైకి వెళ్లింది. అపుడు చిన్నారి తల కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందడంతో, పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
 
తలపై కుడి చెవి పూర్తిగా తెగిపోయి ఉండటం, దవడపై కత్తిగాట్లతో నరబలిగా అనుమానించారు. చుట్టు పక్కల ప్రాంతాలతో పాటు సమీపంలోని డ్రైనేజీల్లో సైతం మొండెం కోసం గాలింపు చేపట్టారు. ఈ ప్రాంతంలో ఏ పోలీసు స్టేషన్లోనూ చిన్నారి అదృశ్యం ఫిర్యాదు నమోదు కాలేదు. పైగా, పౌర్ణమి నాడు సంపూర్ణ చంద్రగ్రహం కావడంతో, ఎవరో నరబలికి పాల్పడి ఉంటారని భావిస్తున్న పోలీసులు, కేసును నమోదు చేసి విచారణ చేపట్టారు. 
 
కాగా, పోలీసు జాగిలాలు ఓ ఇంటి చుట్టూనే తిరగడం అనుమానాలను పెంచుతోంది. ఓ ఇంట్లోని దేవుడి గది వరకూ కూడా జాగిలాలు వెళ్లడం గమనార్హం. దీంతో పోలీసులు ఆ చుట్టుపక్కల వారిని అదుపులోకి తీసుకుని వారిని ప్రశ్నిస్తున్నారు.