శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 22 ఏప్రియల్ 2021 (10:35 IST)

ఎస్వీబీసీ భక్తి చానెల్‌లో పోర్న్ లింక్ వివాదం : మరో ఇద్దరిపై వేటు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలో నడిచే శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్‌‌లో పోర్న్ వీడియో లింక్ షేర్ చేసిన వ్యవహారంలో మరో ఇద్దరు ఉద్యోగులపై తితిదే పాలక మండలి వేటు వేసింది. 
 
అశ్లీల దృశ్యాల లింక్‌ ఘటనలో ఇప్పటివరకు 10 మందిపై టీటీడీ చర్యలు తీసుకుంది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన టీటీడీ.. సైబర్‌ సెక్యూరిటీ నిఘా విభాగంతో విచారణ చేపట్టింది. ఉద్యోగం నుంచి తొలగించిన ఉద్యోగుల కంప్యూటర్లలో అశ్లీల దృశ్యాలు ఉన్నట్లు గుర్తించింది.
 
ఎస్వీబీసీ ఛానల్‌లో ప్రసారమయ్యే "శతమానం భవతి" కార్యక్రమ వివరాల కోసం వెంకటకృష్ణ అనే భక్తుడు గతేడాది నవంబరులో ఛానల్‌కు మెయిల్‌ చేశారు. అయితే ఆ మెయిల్‌కు కార్యక్రమ వివరాలు పంపాల్సిన ఛానల్‌ ఉద్యోగులు దానికి బదులు నీలి చిత్రాలకు సంబంధించిన పోర్న్‌ సైట్‌ లింక్‌ పంపించారు. 
 
దీంతో గత ఏడాది నవంబరు 6న టీటీడీ ఈవోకు సదరు భక్తుడు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేయాలని టీటీడీ విజిలెన్స్ అధికారులను తితిదే ఈవో ఆదేశించారు. విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా అప్పట్లోనే ఆరుగురు ఉద్యోగులను ఎస్వీబీసీ యాజమాన్యం తొలగించింది. 
 
మరో ముగ్గురు ముఖ్య అధికారుల పాత్రపై టీటీడీ ఈవో ఈ ఏడాది జనవరి 2న నలుగురు సీనియర్‌ అధికారులతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ ముగ్గురు అధికారులను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఎస్వీబీసీ సీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.
 
ఇదే క్రమంలో ఎస్వీబీసీలో మేనేజర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరావు ఆఫీస్‌ కంప్యూటర్‌లో కూడా కొన్ని అసభ్యకర వీడియోలు, ఫొటోలతో పాటు సినిమాలున్నట్టు తేలడంతో అతన్ని విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. 
 
మరోవైపు, ఎస్వీబీసీలో ఎడిటర్‌గా విధులు నిర్వహిస్తున్న మిట్టపల్లి రవికిరణ్‌ ఇటీవల ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా వ్యవహారంలో పట్టుబడ్డాడు. పోలీసుల నివేదిక ఆధారంగా అతన్ని కూడా ఎస్వీబీసీ నుంచి తొలగించారు. రవికిరణ్‌పై గతంలో క్రిమినల్‌ కేసులు కూడా ఉన్నట్టు పోలీసుల నివేదికలో తేలింది.