మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 3 మార్చి 2021 (11:16 IST)

ఏప్రిల్ 1 నుంచి పట్టణ ప్రజలకు పన్నుభారం: చంద్రబాబు

జగన్ కు ఓటేస్తే ప్రజలపై భారం పడుతుందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు తెలిపారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ... 
 
అద్దె విలువ ఆధారంగా ఉండే పన్నులను ప్రభుత్వ రిజిస్టర్ విలువ పెంచినప్పుడల్లా ఆస్తి పన్ను పెరిగేలా జగన్ రెడ్డి చట్టం తీసుకొచ్చారన్నారు. నివాస భవనాలకు ఆస్థి పన్ను రిజిష్టర్డ్ విలువలో 0.5 శాతం వరకు పన్ను విధిస్తున్నారు. ఉదాహరణ – ఖాళీ స్థలం విలువ నిర్మిత భవనం విలువ కలిపి ఆస్థి విలువ కోటి రూపాయలు ఉందనుకుంటే దానికి ఏప్రిల్ 1 నుండి ఆస్థి పన్ను సంవత్సరానికి రూ.50 వేల వరకు చెల్లించవలెను.

గతంలో ఈ ఇంటికి సుమారు సంవత్సరానికి రూ.1.5 లక్షలు అద్దె వస్తే సుమారు రూ.5 వేల వరకు పన్ను ఉండేది. పన్ను రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు పెరుగుతుంది. దీనివల్ల పట్టణ ప్రజలపై మరింత భారం పడుతుంది.
నివాసేతర భవనాలకు ఆస్థి పన్ను (కమర్షియల్ భవనాలు) రిజిష్టర్డ్ విలువలో 2 శాతం వరకు పన్ను విధిస్తున్నారు. 

ఉదాహరణ - ఖాళీ స్థలం విలువ మరియు నిర్మిత, నివాసేతర భవనం విలువ కలిపి ఆస్థి విలువ కోటి రూపాయలు ఉంటే ఏప్రిల్ 1 నుండి సంవత్సరానికి రూ.2 లక్షల వరకు ఆస్థి పన్ను చెల్లించవలెను. పాత పద్దతిలో  ఇదే భవనానికి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు పన్ను ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం తన అప్పు పరిధి పెంచుకోవడానికి ప్రజలపై భారం వేయడం సిగ్గుచేటు. 

పట్టణాల్లో ఆస్తి పన్ను పెంచడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలపై అద్దెలు పెంచి మరింత భారం వేయనున్నారు. విద్యుత్ రంగంలో శ్లాబు విధానం తీసుకొచ్చి ప్రజల నెత్తిన వేలాది రూపాయలు భారం విధించే విధంగా ఆస్తి పన్ను పెంచి ప్రజలను అప్పులపాలు చేస్తున్నారు.

ఖాళీ స్థలం పన్ను ఆస్థి విలువలో మున్సిపాలిటీలలో 0.2 శాతం, మున్సిపల్ కార్పోరేషన్ లలో 0.5 శాతం పన్ను చెల్లించాలి. ఉదాహరణ – ఖాళీ స్థలం విలువ కోటి రూపాయలు ఉందనుకుంటే మున్సిపాలిటీల్లో సంవత్సరానికి రూ.20 వేలు, మున్సిపల్ కార్పోరేషన్ లో సంవత్సరానికి రూ.50 వేలు పన్ను క్రింద చెల్లించవలెను. 

దీనికి అదనంగా ఖాళీ స్థలంలో చెత్త గనుక ఉన్నట్లయితే మున్సిపాలిటీలలో 0.1 శాతం పెనాల్టీ క్రింద అనగా సంవత్సరానికి రూ.10 వేలు మరియు మున్సిపల్ కార్పోరేషన్ లో అయితే పెనాల్టీ 0.25 శాతం అనగా సంవత్సరానికి రూ.25 వేలు అదనంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా భారాలు వేసేందుకు మాత్రం జగన్ రెడ్డి చట్టాలు తీసుకొస్తున్నారు. 

గతంలో పన్ను వేయని భవనాలు, ఖాళీ స్థలాలకు నూతన విధానంలో రిజిష్టర్డ్ విలువ ఆధారంగా పన్ను వేసేలా జగన్ రెడ్డి కొత్త చట్టం తీసుకొచ్చారు. పేద లేదా మధ్యతరగతి వారు కూడా 375 అడుగులు కన్నా ఎక్కువ నిర్మిత భవనంలో కనుక ఉన్నట్లయితే వారు కూడా రిజిష్టర్డ్ విలువ ఆధారంగా పన్ను చెల్లించేలా చట్టాలు తీసుకురావడం ప్రజలను వేధించడం కాదా?

అపార్ట్ మెంట్లు వారు రిజిష్టర్డ్ విలువ ఆధారంగా పన్ను చెల్లించాలని నిబంధనలు పెట్టడం మధ్యతరగతి ప్రజల మీద భారం వేయడం కాదా? పేదలు అనధికారికంగా ప్రభుత్వ స్థలంలో గాని, మున్సిపల్ స్థలంలో గాని, ఎండోమెంట్ ల్యాండ్ లో గాని, వక్ఫ్ భూముల్లో గాని లేదా ఇతర పబ్లిక్ ప్రదేశాలలో ఇల్లు కట్టుకుంటే  ఎటువంటి పట్టా గానీ, డాక్యుమెంట్ గానీ లేకపోయినా 100 శాతం అదనపు పన్ను విధించడం కక్ష సాధింపు చర్యలను నిదర్శనంలా కనిపిస్తోంది. 

నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలతో సతమతమవుతున్న ప్రజలు పెంచిన ఆస్తి పన్నును ఎలా చెల్లించగలుగుతారు? ఒక్కరోజైనా జగన్ రెడ్డి మానవతా దృక్పథంతో ఆలోచించారా? మధ్యతరగతి ప్రజలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు.

గురువారం నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా. కర్నూలు, చిత్తూరు, తిరుపతి, విశాఖ, విజయవాడ, గుంటూరులో రోడ్డు షో లో పాల్గొంటానని తెలిపారు. టీడీపీని గెలిపిస్తే ప్రజలకు అండగా వుంటుందని తెలిపారు.

మద్యం సీసాలు వాళ్లే తెచ్చిపెట్టి టీడీపీ వారిపైనే కేసులు పెట్టడానికి కూడా వెనుకాడరని, ఇలాంటి వాటి పట్ల నాయకులు జాగ్రత్త పడాలని అన్నారు. గతంలో తెనాలిలో ఇదే తరహా అరాచకానికి పాల్పడ్డారని అన్నారు. కష్టపడి పనిచేస్తే అనుకున్న ఫలితాలు తప్పకుండా వస్తాయని, సమస్యలు వస్తే వెంటనే అభ్యర్థులు అధికారులకు ఫిర్యాదులు ఇవ్వాలని సూచించారు.

పోటీ చేసే అభ్యర్థులను కిడ్నాప్ చేసి బెదిరించే పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అరాచకాలను ధైర్యంగా ఎదుర్కొంటే ఏమీ చేయలేరన్నారు. అందరూ ధైర్యంగా పోరాడాలని కోరారు. అన్యాయం జరిగితే అందుబాటులో న్యాయవాదులుంటారని, ఎక్కడ ఏ తప్పు జరిగినా ఆధారాలు దగ్గర పెట్టుకోవాలని సూచించారు.

న్యాయబద్ధంగా పోరాడితే తప్పు చేయడానికి అధికారులు కూడా భయపడతారన్నారు. అధికారులు ప్రభుత్వానికి సహకరిస్తూ ఏ నేరం చేసినా తప్పించుకోలేరని వివరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి బెదిరించినా అధికారులు తప్పు చేయకుండా వుండే పరిస్థితి రావాలన్నారు.

కష్టకాలంలో పోరాడితేనే గుర్తింపు వుంటుందని, కలిసి కట్టుగా పోరాడితే విజయం వరిస్తుందని వివరించారు. వైసీపీ బెదిరింపులకు భయపడి నామినేషన్లు వెనక్కు తీసుకోవడం పిరికిచర్య అని, ఇబ్బందులుంటే అన్ని విధాలా అండగా టీడీపీ వుంటుందని భరోసా ఇచ్చారు.

అందరూ ధైర్యంగా పోరాడాలని, ఏదైనా ఘటన జరిగితే తాను కూడా వచ్చి పోరాడతానన్నారు. వాలంటీర్లకు భయపడాల్సిన అవసరం లేదని,  ఎస్ఈసీ కూడా వారి నుండి ఫోన్లు స్వాధీనం చేసుకోవాలని ఆదేశించిందని అన్నారు. న్యాయంగా పోరాడదామని, ఇప్పుడు పోరాటం చేస్తే భవిష్యత్తులోనూ అధికారులు సక్రమంగా పనిచేసే అవకాశం వుంటుందన్నారు.

నాయకులందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆదేశించారు. నాయకుడు ప్రజల్లో నమ్మకం కలిగించాలని అన్నారు. ప్రతి ఇళ్లూ తిరిగి ప్రభుత్వ దుర్మార్గ పాలనను  ప్రజలకు వివరించాలన్నారు. ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఆస్తి పన్ను పెరగడం వల్ల ఇంటి అద్దెలు పెరిగి మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడతారని తెలిపారు.