1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 29 నవంబరు 2020 (18:52 IST)

ఇకపై టాక్సీలుగా ద్విచక్రవాహనాలు!

దేశవ్యాప్తంగా వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎలక్ట్రిక్‌, బయో ఇంధనంతో పనిచేసే ద్విచక్రవాహనాలను టాక్సీలుగా వినియోగించేందుకు ప్రత్యేక అనుమతులు ఇవ్వనున్నట్లు రోడ్లు, రవాణా రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు.

ఈ వాహనాలకు మీటర్‌ కూడా ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు. ఎఫ్‌ఎడిఎ పాలకమండలి సభ్యులతో జరిగిన తాజా సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఎలక్ట్రిక్‌, అత్యున్నత నాణ్యత కలిగిన వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన ఫేమ్‌ (ఎఫ్‌ఎఎంఇ) పథకం రెండోదశలో భాగంగా వీటిని అనుమతించామన్నారు.

పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రజలంతా ఎలక్ట్రిక్‌ వాహనాలను వినియోగించేలా చర్యలను వేగవంతం చేయనున్నట్లు నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న 69వేల పెట్రోల్‌ బంకుల్లో చార్జింగ్‌ కిట్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ముంబయి, కోల్‌కతా, చెన్నై వంటి నగరాల్లో స్టేషన్‌, లేదా విమానాశ్రయాలకు వెళ్లాలనుకునే వారికి ఈ ద్విచక్ర టాక్సీలు ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. వీటికోసం ప్రత్యేకంగా నిబంధనలను జారీ చేస్తామని, ఈ పథకం ఫలవంతమైతే మంచి వ్యాపారం అవుతుందని సూచించారు.

అలాగే ఎలక్ట్రిక్‌ ట్రాలీ బస్సులను కూడా ప్రవేశపెట్టనున్నట్లు గడ్కరీ పేర్కొన్నారు. విద్యుత్‌పై పనిచేసే ఈ బస్సులు తక్కువ ఖర్చుతో ఆర్థికంగా లాభదాయకమని అన్నారు.