శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 4 జూన్ 2024 (12:37 IST)

జూన్ 9వ తేదీన అమరావతిలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం!!

chandrababu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 9వ తేదీన రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని చంద్రబాబు ప్రకటించిన విషయం తెల్సిందే. గత ఐదేళ్ళుగా ఆ ప్రాంతాన్ని వైకాపా ప్రభుత్వం పక్కన బెట్టేసింది. ఇపుడు ఆ ప్రాంత వాసులకు, రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు భరోసా కల్పించేందుకు వీలుగా అమరావతి ప్రాంతంలోనే చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు నిర్ణయించుకున్నారు. 
 
మంగళవారం ఉదయం నుంచి వెలువడుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సునామీ సృష్టించిన విషయం తెల్సిందే. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక్కటే ఏకంగా 120కి పైగా సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుంది. అలాగే, జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేయగా, 21 చోట్ల, పది స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ ఎనిమిది చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
 
మరోవైపు, ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమికి అనుకూలంగా ఉండటంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు భద్రతను పెంచారు. అలాగే, మంగళగిరిలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయానికి కూడా పోలీసులు భద్రతను పెంచారు. అదేవిధంగా మంగళగిరిలో ఉన్న జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద కూడా పోలీసులను అధిక సంఖ్యలో మొహరించి, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌‍కు కూడా భద్రతను పెంచారు.