శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 మార్చి 2021 (18:01 IST)

రౌడీలకు రౌడీని నేను... నీ గుండెల్లో నిద్రపోతా... పెద్దిరెడ్డికి చంద్రబాబు వార్నింగ్

చిత్తూరు జిల్లాకు చెందిన ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పనికిమాలిన మంత్రి అంటూ ఫైర్ అయ్యారు. విజయవాడలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆదివారం పాల్గొన్న ఆయన.. ‘‘రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి.. ఈ జిల్లాకు ఇన్‌చార్జ్ కూడా.. పెద్ద రౌడీ అనుకుంటున్నాడు. రౌడీలకు రౌడీని నేను... నీ గుండెల్లో నిద్రపోతా.
 
ప్రజలు తిరగబడితే... నీ రౌడీలు పారిపోవడం ఖాయం. బట్టలిప్పించడం ఖాయం... జాగ్రత్త. సిగ్గు.. ఎగ్గు, మానం ఏమీ లేవు. అన్నిటినీ వదిలేశారు. దౌర్జన్యాలు చేసి గెలవాలనుకుంటున్నారు. అసలే ప్రతిపక్షం లేకపోతే... అడిగేవాడు లేకపోతే.. ఎలా? విజయసాయి రెడ్డి... విశాఖకు శనిలా పట్టాడు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 
 
అలాగే, ఏపీ మంత్రుల్లో బూతుల మంత్రిగా పేరుగాంచిన కొడాలి నానికి కూడా చంద్రబాబు గట్టి కౌంటరిచ్చారు. ‘‘ఒకడు బూతుల మంత్రి... నోరు పారేసుకుంటాడు.. పేకాట ఆడిస్తాడు. ఆడితే తప్పేముంది అంటాడు. ఎంత సింపుల్ సమాధానం. తాడేపల్లిలో సీఎం దగ్గరకు వెళ్లి దర్జాగా బయటకు వస్తాడు. అంటే సీఎం ఆశీస్సులు తీసుకున్నట్టా?’’ అంటూ కొడాలిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 
 
మేయర్ పదవిని సాధించాలని, లేదంటే విజయవాడ జనం తలెత్తుకు తిరగలేరన్నారు. నేరస్థుల అడ్డాగా ఆంధ్రాను తయారు చేస్తున్నారని వాపోయారు. పేదోళ్లకు కనీసం ఐదు రూపాయల భోజనం పెడుతుంటే... టీడీపీకి పేరొస్తుందనే భయంతో.. అన్నా క్యాంటీన్‌లను నిరుపయోగం చేశారని తెలిపారు. ‘‘ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ మెడలు వంచుతా అన్నాడు... ప్రత్యేక హోదా ఏమైంది? ఎవరికైనా న్యాయం జరిగిందా..?’’ అని ప్రశ్నించారు. 
 
అమరావతి నాకోసం కాదు.. ప్రజల కోసమన్నారు. అమరావతి రాజధాని కోసం రైతులు భూములిచ్చారని గుర్తుచేశారు. అమరావతి ఆంధ్రుల హక్కుపై ప్రజలందరూ పోరాడాలని పిలుపునిచ్చారు. అమరావతి కోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తామని చెప్పారు. అమరావతి కోసం విజయవాడ ప్రజలు గట్టిగా నిలబడాలని సూచించారు. అమరావతి కోసం ఇంటికొక్కరు బయటకు రావాలని చెప్పారు. ఇక్కడి మంత్రికి దుర్గమ్మపై భయం, భక్తి లేదని మండిపడ్డారు. విజయవాడ మేయర్‌గా టీడీపీ అభ్యర్థిని గెలిపించాలన్నారు. వైసీపీ దౌర్జన్యాలను అడ్డుకోవాలంటే టీడీపీ గెలివాలన్నారు.