గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

బుద్ధీ, జ్ఞానం ఉన్న సీఎం అయితే సుప్రీంకోర్టుకు వెళతారా? చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోమారు విమర్శలు గుప్పించారు. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడాన్ని తప్పుబట్టారు. బుద్ధీ, జ్ఞానం ఉన్న సీఎం అయితే పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు చూసిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లేవారు కాదన్నారు. ఏపీ పంచాయతీ పోల్‌పై చంద్రబాబు స్పందిస్తూ, కోర్టులు, బెంచ్‌లు, జడ్జిలు మారితే న్యాయం మారుతుందని భ్రమించారని, కాని అది మారదని మరోసారి రుజువైందన్నారు. 
 
అంతేకాకుండా, ఈ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, తొలిరోజే సాధ్యమైనంత ఎక్కువగా నామినేషన్లు వేయాలని సూచించారు. ఏవైనా సాంకేతిక అభ్యంతరాలు ఎదురైనా తర్వాత పరిష్కరించుకోవచ్చన్నారు. ఎక్కడ ఆటంకాలు ఎదురైనా, వైసీపీ నేతలు ఘర్షణలకు దిగినా.. ఫొటోలు, వీడియోలు సేకరించాలి. లిఖితపూర్వక ఫిర్యాదుతో పాటు సాక్ష్యాధారాలను రిటర్నింగ్‌ అధికారులకు అందజేయాలని కోరారు.
 
ఇందుకోసం దీనికోసం 24 గంటలూ పని చేసేలా టీడీపీ కేంద్రకార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎన్నికల్లో పూర్తి సమాచారం ఇచ్చేందుకు తెదేపా న్యాయవిభాగం న్యాయవాదులంతా సిద్ధంగా ఉంటారని చెప్పారు. ప్రతిచోటా డమ్మీ అభ్యర్థులను నిలపాలి. ఉద్యోగులు ఎక్కడైనా ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, సహాయ నిరాకరణ చేస్తే వారిపై ఫిర్యాదులు ఇవ్వాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు.
 
ఇకపోతే, గత మార్చి  నెలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 25 శాతం బలవంతపు ఏకగ్రీవాలే జరిగాయి. అప్పుడు వైసీపీ నేతలు దాడులు, దౌర్జన్యాలతో భయోత్పాతం సృష్టించారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో కూడా హింస, దౌర్జన్యాలతో ఏకగ్రీవాలు చేయాలని చూసే అధికార పార్టీకి బుద్ధి చెప్పాలి. ఎక్కడా బలవంతపు ఏకగ్రీవాలను జరగనివ్వరాదని ఆయన పార్టీ నేతలకు దిశానిర్దే శం చేశారు. 
 
వైసీపీ అరాచకాలపై వీరోచితంగా పోరాడాలని పిలుపిచ్చారు. రాష్ట్రంలో తొలిదశ పంచాయతీ ఎన్నికలపై గ్రామ, మండల కమిటీల బాధ్యులు, టీడీపీ ప్రజాప్రతినిధులతో మంగళవారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 'ఎన్నికల్లో పోటీకి కావాల్సిన కుల, స్థానికత ధ్రువీకరణ, నో డ్యూస్‌ ధ్రువపత్రాలను అభ్యర్థులంతా సిద్ధం చేసుకోవాలి. ఏమేం కావాలో, ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పటికే సమాచారం ఇచ్చినట్టు చెప్పారు.