దురుద్దేశంతోనే రాజీనామా లేఖను ఆమోదించారు : కోర్టుకెక్కిన గంటా శ్రీనివాస రావు
త్వరలోనే రాజ్యసభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తన ఓటు కీలకపాత్ర పోషిస్తుందని తెలిసి... ఎమ్మెల్యే పదవికి మూడేళ్ల క్రితం చేసిన రాజీనామాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇపుడు ఆమోదించారని, దీనివెనుక రాజకీయ దురుద్దేశం ఉందని మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. ఇదే విషయంపై ఆయన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
విశాఖ నార్త్ శాసనసభ నియోజకవర్గానికి 2021లో తాను చేసిన రాజీనామాను ఆమోదిస్తూ స్పీకర్ ఈ ఏడాది జనవరి 23న ఇచ్చిన ఉత్తర్వులు, దానిని అనుసరించి న్యాయ, శాసన వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన గెజిట్ ప్రకటనను చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించి, వాటిని రద్దు చేయాలని అభ్యర్థించారు. ఆ మేరకు మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. తాను శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనడంతోపాటు రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు మార్గం సుగమం చేసేలా చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను ఆదేశించాలని పేర్కొన్నారు.
'టీడీపీ తరపున 2019 ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందా. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిని నిరసిస్తూ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నా. నిరసనలో భాగంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా. 2021 ఫిబ్రవరి 12న స్పీకర్‌కు లేఖ పంపా. దానిని నేను స్పీకర్‌కు వ్యక్తిగతంగా అందించనూ లేదు. ఆ లేఖపై వారు చర్యలూ తీసుకోలేదు.
ఇన్నాళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతూనే ఉన్నాను. 2023 ఫిబ్రవరిలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓటు వేశా. 2021 నుంచి శాసనసభ సమావేశాలకు హాజరవుతూనే ఉన్నా. నా రాజీనామాను ఈ యేడాది జనవరి 23న స్పీకర్ ఆమోదించడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన నన్ను పిలిచి వివరణ కోరలేదు. శాసనసభ బిజినెస్ రూల్ 186 ప్రకారం విచారణ చేపట్టాల్సి ఉన్నా... పట్టించుకోకుండా రాజీనామా ఆమోద నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఏడాది మార్చిలో నిర్వహించబోయే రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయకుండా చేయాలన్న ఉద్దేశంతోనే నా రాజీనామాను ఆమోదించారు. నేను సమర్పించిన లేఖపై మూడేళ్లపాటు మౌనం వహించిన స్పీకర్.. రాబోయే ఎన్నికల్లో టీడీపీ సభ్యుల సంఖ్యను తగ్గించాలనే రాజీనామాను ఆమోదించారు. స్పీకర్ ఉత్తర్వుల్ని సస్పెండ్ చేయకపోతే పూడ్చుకోలేని నష్టం వాటిల్లుతుంది.
ఆ ఉత్తర్వులతోపాటు ప్రభుత్వ గెజిట్ ప్రకటనను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వండి. ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేలా, రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా తగిన ఆదేశాలివ్వండి అని గంటా శ్రీనివాసరావు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. న్యాయ, శాసన వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ శాసనసభ స్పీకర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ సోమవారం ఈ వ్యాజ్యంపై విచారణ జరపనున్నారు.