సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 13 ఆగస్టు 2019 (14:49 IST)

అక్రమ నిర్మాణాల పేరుతో నెల్లూరులో టీడీపీ నేతల ఇళ్లు కూల్చివేత

జిల్లా కేంద్రమైన నెల్లూరు పట్టణంలో అక్రమ నిర్మాణాల పేరుతో తెలుగుదేశం పార్టీకి చెందిన గృహాలను స్థానిక రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 
 
నెల్లూరులోని వెంకటేశ్వరపురంలో టీడీపీ నేత ఇల్లు కూల్చివేతను అడ్డుకున్న నుడా మాజీ ఛైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి అరెస్టును మాజీ మంత్రివర్యులు, పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు. 
 
అలాగే, 
వెంకటేశ్వరపురంలోని సర్వే నంబర్ 2209లో 57 ఇళ్లు ఉండగా టీడీపీ మాజీ కార్పొరేటర్ సల్మా జహీర్ నివాసాన్నే కక్షకట్టి కూల్చేయడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు. కూల్చడాలే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వ పాలన సాగుతోందన్నారు. 
 
ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసు యంత్రాంగం వైకాపా దౌర్జన్యాలకు అండగా నిలుస్తుండటం దురదృష్టకరమన్నారు. పోలీసు, రెవెన్యూ అధికారులు కూడా ఆలోచించుకోవాలని, వైకాపా నేతల పాపాల్లో భాగం కావొద్దని కోరారు. 
 
వైకాపాకు భారీ మెజార్టీతో అధికారం ఇచ్చిన ప్రజలకు ప్రతిఫలంగా వారిపైనే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా వైకాపా పాలకులు పద్ధతి మార్చుకోవాలన్నారు. కక్షసాధింపులు, కూల్చడాలు.. దాడులు మాని నిండుమనస్సుతో ప్రజారంజకంగా పాలన సాగించాలని కోరారు.