శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (15:14 IST)

అడ్డమైన పనులు చేసి చిప్పకూడు తిన్నది ఎవరో తెలుసు : బుద్ధా వెంకన్న

ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డితో పాటు వైకాపా ప్రజాప్రతినిధులపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నా మరోమారు విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఈ విమర్శలు చేశారు. అడ్డమైన పనులు చేసి 16 నెలల పాటు చిప్పకూడు తిన్నది ఎవరో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసన్నారు. 
 
ఇన్‌సైడర్ ట్రేడింగ్ బండారం బయట పడేటప్పటికి ఎలాగూ జైలుకు పోయేదేకదా అని పిచ్చి కూతలు కూస్తున్నారని, టీడీపీ నేతల రాజకీయ జీవితాలకు తెరపడే రోజులు వచ్చాయంటూ వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బుద్ధా వెంకన్న గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. 
 
'వైఎస్ జగన్‌గారు, మీరు కలిసి మొదలుపెట్టిన మూడు రాజధానుల దందా వెనుక ఉన్న అసలు రహస్యాలు తెలిసి అధికారులు పారిపోతున్నారు. ముందు వారిని ఆపే మార్గం చూడండి విజయసాయిరెడ్డి గారు' అని బుద్ధా వెంకన్న సూచించారు. 
 
అంతేకాకుండా, 'అడ్డమైన పనులు చేసి 16 నెలలు చిప్పకూడు తిన్న నీకు మా రాజకీయ జీవితాలకు తెరపడే రోజులు వచ్చాయి అనే అంత ధైర్యం వచ్చిందా? అంతవరకూ వచ్చాకా మేము మాత్రం చూస్తూ కూర్చుంటామా? మిమల్ని, మీ జగన్‌గారిని మళ్లీ జైలుకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. రెడీగా ఉండండి' అని ట్వీట్ చేశారు.
 
'పాత తప్పులు, ఇప్పుడు మూడు రాజధానుల పేరుతో వైజాగ్‌లో చేస్తున్న భూముల దందా అంతా బయటపడుతుంది మీరు, మీ పరివారం ఊచలు లెక్కపెట్టడం ఖాయం సాయి రెడ్డి గారు' అని బుద్ధా వెంకన్న జోస్యం చెప్పారు.