సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 జనవరి 2020 (11:53 IST)

జగనన్నా.. నువ్వు.. నీ ముఠా ఒక్క అంగుళం కూడా కదల్చలేరు : కేశినేని

ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విజయవాడ ఎంపీ, టీడీపీ నేత కేశినేని నాని సైటెర్లు వేశారు. జగన్ అన్నా... నీవు, నీ ముఠా కలిసి రాజధాని అమరావతిని అంగుళం కూడా కదల్చలేరన్నా అంటూ జోస్యం చెప్పారు. ఏపీ అసెంబ్లీలో శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానం చేయగా, దీనిపై కేశినేని నాని స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శాసన మండలి రద్దు అవ్వదు జగన్ రెడ్డి గారూ అంటూ కేశినేని ట్వీట్ చేశారు. 
 
శాసన మండలిని రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కేంద్ర న్యాయశాఖ ముందుకు తీసుకువెళ్లే అవకాశమే లేదన్నారు. ఇటువంటి తీర్మానాలను తప్పుబడుతూ రాజ్యసభ స్థాయీ సంఘం ఓ నివేదిక సమర్పించిందని, దాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టారని ఆయన గుర్తుచేశారు. 
 
ఈ పరిస్థితుల్లో న్యాయ శాఖ మళ్లీ రాష్ట్రానికి సంబంధించిన తీర్మానాన్ని చేపట్టి పార్లమెంటుకు పంపదని చెప్పారు. అంతేకాదు జగన్ అన్నా... నువ్వూ నీ ముఠా అమరావతి నుండి రాజధానిని ఒక అంగుళం కూడా కదల్చలేరు. హైకోర్టు‌ను అమరావతి నుండి మార్చలేరు. శాసన మండలిని రద్దు చెయ్యాలనే మీ ప్రతిపాదన జరిగే పని కాదు. మీ వల్ల ఏదీ కాదు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.