శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 జనవరి 2020 (09:24 IST)

ఏ-1 ఎక్కడ? ప్రతిసారి సాకులేనా? 31న రాకుంటే అంతే : సీబీఐ కోర్టు వార్నింగ్

అక్రమాస్తుల కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి శుక్రవారం జరిగిన విచారణకు డుమ్మాకొట్టారు. దీనిపై  హైదరాబాద్ నాంపల్లిలోని ప్రత్యేక కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతిసారీ సాకులు చెప్పడమేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దఫా రాకుంటే మాత్రం తగిన ఉత్తర్వులు జారీచేస్తామంటూ హెచ్చరించింది. దీంతో ఈనెల 31వ తేదీ విచారణకు జగన్మోహన్ రెడ్డి తన అక్రమాస్తుల కేసు విచారణ కోసం ఏ-1 నిందితుడుగా కోర్టుకు హాజరుకావాల్సివుంది. 
 
కాగా, ఈడీ కేసుల విచారణకు తాను హజరుకాకుండా వ్యక్తిగత హజరుమినహయింపు ఇవ్వాలని వైఎస్ జగన్ తరపు న్యాయవాదులు వేసిన పిటీషన్‌ను ఈడీ కోర్టు తోసిపుచ్చింది.. అంతేకాకుండా వైఎస్ జగన్ తప్పనిసరిగా ఈనెల 31వ తేదిన విచారణకు హజరుకావాలని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ వైఎస్ జగన్ విచారణకు హజరుకాకపోతే అప్పుడు తగు ఆదేశాలు జారీ చేస్తామని కోర్టు స్పష్టం చేయడంతో వైఎస్ జగన్ తప్పనిసరిగా కోర్టుకు హజరుకావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
 
ఎన్‌ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ కేసు విచారణకు వచ్చేవారం ఏ1 నిందితుడిగా ఉన్న వైఎస్ జగన్ హజరుకావాల్సిందే...ఈడీ అధికారులు మనీలాండరింగ్ కోణంలో ఐదు చార్జీషీట్లను కోర్టులో దాఖలు చేశారు. రాంకీ, వాన్ పిక్, జగతి, పెన్నా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్‌కు సంబంధించి చార్జీషీట్లు కోర్టు ముందున్నాయి. ఈ ఐదు చార్జీషీట్లకు సంబంధించిన విచారణకు ప్రతివారం తాను హజరుకాలేనని, మినహయింపు ఇవ్వాలని వైఎస్ జగన్ వేసిన పిటీషన్ కోర్టు తోసిపుచ్చింది. అంతేకాదు ఈ కేసులో తన తరఫున సహ నిందితుడిని హజరుకు అనుమతించాలని చేసిన అభ్యర్ధనను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.
 
సీబీఐ దాఖలు చేసిన 11 చార్జీషీట్లకు సంబంధించి విచారణ సీబీఐ కోర్టులో జరుగుతుంది. ఈ కేసులను ప్రతి శుక్రవారం విచారించాలని హైకోర్టు ఆదేశించింది. వీటిలో ఐదు చార్జీషీట్లకు సంబంధించి చార్జెస్ ఫ్రేమ్ వర్క్ జరుగుతుంది. అదేసమయంలో ఈడీ దాఖలు చేసిన ఐదు చార్జీషీట్లను సైతం సీబీఐ కోర్టు న్యాయమూర్తి ముందుకే విచారణకు వచ్చాయి. అయితే ఇవన్నీ ఒకటే నేరారోపణలు కాబట్టి ఈడీ, సీబీఐ కేసులను కలిపి విచారించాలని వేసిన పిటీషన్‌ను ఇప్పటికే కోర్టు తోసిపుచ్చింది. విచారణ ముందుకు సాగకుండా పిటీషన్ల మీద పిటీషన్లు దాఖలు చేస్తున్నారని న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు.