శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 జనవరి 2020 (11:09 IST)

చంద్రబాబును జైల్లో పెట్టివుండాల్సింది... త్వరలోనే జైలుకు జగన్ : జేసీ దివాకర్

గత ప్రభుత్వం హయాంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పు చేసివుంటే నేటి ప్రభుత్వం ఆయన్ను జైల్లో పెట్టివుండాల్సింది అని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఎక్కడైనా అనాలోచితంగా తప్పుచేస్తే చేసివుండొచ్చుగానీ, దుర్మార్గమైన ఆలోచనతో చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని జేసీ చెప్పుకొచ్చారు. 
 
గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పమిడిపాడులో ఎన్‌టీఆర్‌ విగ్రహాన్ని ఆయన శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ 'కేవలం ఒక కులంపైన, ఒక సామాజిక వర్గంపైన ద్వేషంతో జగన్‌ నేడు రాష్ట్రాన్ని చీల్చేయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు నిజంగానే తప్పుచేసి ఉంటే ఏసీబీతోనో, సీబీఐతోనో విచారణ చేసి జైల్లో పెట్టి ఉండాల్సింది. ఏడు మాసాలైనా ఎందుకు జైలులో పెట్టలేకపోయావు? అంటూ నిలదీశారు. 
 
నిజానికి తొలుత నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పెట్టాలన్నప్పుడు తాను తీవ్రంగా వ్యతిరేకించాను. అనంతపురం నుంచి అమరావతి రావడానికి ఒకరోజు పడుతుందని, వెంటనే పనులు కావని, మర్నాడు కూడా ఉండాల్సి వస్తుందని అన్నాను. అలాంటిది మరోమారు ఈ మూర్ఖుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాజధానిని మార్చాలని చూడడం సమంజసమా? ఇదేమైనా మీ జాగీర్దారా, మీ నాయన సొమ్మా? ముఖ్యమంత్రిగా వచ్చిన ప్రతివాడూ రాజధాని మార్చాలంటే అది సాధ్యమేనా? అంటూ ప్రశ్నించారు. 
 
రాజధాని అమరావతిలో తెలుగుదేశం వాళ్ళు కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు. అమరావతిలో, విశాఖపట్నంలో వందమందో, 120 మందో సుమారు 20 వేల కోట్లు లబ్ధిపొంది ఉండొచ్చు. అయితే రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు ఉన్నరనే విషయం ముఖ్యమంత్రి మరిచిపోతే ఎలా? వంద మంది లాభపడ్డారని రాజధానిని మార్చుతావా? రాజధాని అనేది ప్రజల ఆస్తి. రాజధాని ఉండాలంటే తల ఉండాలి, దానిలో మెదడు ఉండాలి. సెక్రటేరియట్‌ ఉంటే అది రాజధాని అవుతుంది. మెదడువంటి సెక్రటేరియట్‌ను తీసేసి రాజధాని అంటే నమ్మాడానికి పిచ్చివాళ్లం కాదు.
 
అంతేకాకుండా, ముఖ్యమంత్రి జగన్ మూర్ఖత్వపు చర్యల వల్ల త్వరలో పదవి కోల్పోబోతున్నాడు. ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. రాజధాని అనేది ఒక కులానికి, ప్రాంతానికి సంబంధించినది కాదు. మేము 23వ తేదీన రాజధానిలో రాయలసీమ మీటింగ్‌ పెట్టుకోబోతున్నాం. అమరావతే రాజధానిగా ఉంటే మేము మీ అందరితో సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. విశాఖపట్నంలో రాజధాని పెట్టుకుంటే సహకరించడానికి సిద్ధంగా లేం. ప్రత్యేక రాయలసీమ కావాలి. ఎన్నికష్టాలు వచ్చినా మహిళలతోపాటు పల్నాటి వాసులు ముందుకు రావాలని జేసీ దివాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.