శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 17 డిశెంబరు 2020 (09:42 IST)

ఉపాధ్యాయ బదిలీల వెబ్ ఆప్షన్ గడువు పొడిగింపు: విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి వెబ్ ఆప్షన్ ప్రక్రియ గడువు ఈ నెల 17వ తేదీ వరకూ రెండ్రోజుల పాటు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. సీపీఎస్‌కు సంబంధించి ప్రభుత్వ కార్యాచరణ కొనసాగుతోందని, అక్యూరల్ ఫర్మ్ పేరుతో  ఇటీవల కమిటీ ఏర్పాటు చేశామని, ఇన్స్యూరెన్స్ ప్రీమియం, రిస్క్ లకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులపై ఈ కమిటీ రిపోర్టు అందజేసిందని, అది ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు.

ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించిన వెబ్ ఆప్షన్ గడువు ఈ నెల 15వ తేదీతో(మంగళవారం) ముగిసిందన్నారు. ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయుల వినతి మేరకు మరో రెండ్రోజుల పాటు అనగా డిసెంబర్ 17 వ తేదీ వరకూ వెబ్ ఆప్షన్ సదుపాయం పొడిగిస్తున్నామన్నారు. బుధవారం మధ్యాహ్నం 1.55 నిమిషాల వరకూ 71,947 మంది టీచర్లు... సుమారు 95 శాతం మంది వెబ్ ఆప్షన్‌ను వినియోగించుకున్నట్లు తెలిపారు.

వారిలో ఐదేళ్లు నిండిన ప్రధానోపాధ్యాయులు, ఎనిమిదేళ్లు నిండిన ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. కంపల్షరీ బదిలీల కేటగిరీ కింద 26,134 మందికి గానూ 96 శాతం.. 25,129 మంది వెబ్ ఆప్షన్ ను వినియోగించుకున్నారని, మరో 1,005 మంది ఇంకా వినియోగించుకోవాల్సి ఉందని మంత్రి వెల్లడించారు. రెండేళ్లు నిండిన ఉపాధ్యాయులు రిక్వెస్ట్ కేటగిరీ కింద 49,985 మందికి గానూ 46,818 మంది... సుమారు 94 మంది వెబ్ ఆప్షన్ లో దరఖాస్తు చేసుకున్నారన్నారు.

ఉపాధ్యాయు సంఘాలతో చర్చించిన తరవాతే బదిలీలకు సంబంధించి సవరించిన జీవో నెంబర్లు 53, 54, 59లను ప్రభుత్వం జారీ చేసిందన్నారు. ఉపాధ్యాయ బదిలీల్లో ఎక్కడా నిబంధనలన అతిక్రమించి ప్రభుత్వం వ్యవహరించలేదన్నారు. పారదర్శకంగా, అవినీతికి ఆస్కారం లేకుండా బదిలీలు చేపట్టామన్నారు.

కేటగిరీ 4 లోని పాఠశాలల్లో నిరుపేద విద్యార్థులే విద్యనభ్యసిస్తుంటారని, ఆ పాఠశాలలు నిర్వీర్యమైపోకూడదనదే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఉద్దేశమని అన్నారు. రాష్ట్రంలో విద్యా రంగంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంస్కరణలు దేశ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందాయన్నారు. జగనన్న అమ్మఒడి, నాడు – నేడు పథకాలతో విద్యా వ్యవస్థ అభివృద్ధికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారన్నారు.

ఉపాధ్యాయుల్లో నెలకొన్న అనుమానాలను పెనుభూతాలుగా మార్చి, రాజకీయాలకు వాడుకోవొద్దని విపక్ష నాయకులకు మంత్రి హితవు పలికారు. గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు సకాలంలో ఇవ్వాలని, నాణ్యమైన భోజనం అందించాలని కోరిన ఉపాధ్యాయులను పాఠశాలల్లోకి వెళ్లి అరెస్టు చేశారని మంత్రి అన్నారు. అప్పటి ప్రభుత్వ తీరుకు నిరసనగా ఉపాధ్యాయులకు సంబంధించిన రెండు వీడియోలను మంత్రి విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు.
 
సీపీఎస్ పై చిత్తశుద్ధితో ఉన్నాం...
పెన్షన్ స్కీం సీపీఎస్ అమలుపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టంచేశారు. సీపీఎస్ అమలుపై 2019 ఆగస్టులో మంత్రి వర్గ ఉప సంఘాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారన్నారు. ఆ మంత్రి వర్గ ఉప సంఘంలో తాను కూడా ఉన్నానని, ఇప్పటికి ఎన్నో పర్యాయాలు  భేటీ కూడా అయ్యామని తెలిపారు.

సీఎస్ అడ్వయిజరీగా ఉండే వర్కింగ్ కమిటీ ఆఫ్ సెక్రటరీస్ అనే కమిటీ కూడా ఏర్పాటు చేశామన్నారు. ఇన్స్యూరెన్స్ ప్రీమియం, రిస్క్ పై బడ్జెట్ కేటాయింపులకు అక్యూరల్ ఫర్మ్ పేరుతో మరో కమిటీని ఏర్పాటు చేశామన్నారు. బడ్జెట్ కేటాయింపులపై ఆ కమిటీ రిపోర్టు అందజేసిందని, ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి తెలిపారు. 
 
అర్హులందరికీ ‘జగనన్న అమ్మఒడి’ వర్తింపు..
ఈ నెల 20 తేదీన జగనన్న అమ్మ ఒడి తుది జాబితా పోర్టల్ పెడతామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. గ్రామ సచివాలయాల ద్వారా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా, అవినీతికి ఆస్కారం లేకుండా చేపడుతున్నామన్నారు. అర్హులందరికీ జగనన్న అమ్మ ఒడి పథకం వర్తింపజేస్తామన్నారు.

అర్హులందరూ ఈ నెల 20వ తేదీలోగా గ్రామ సచివాలయాల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యంతో త్వరలోనే సమావేశం నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.