ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 8 డిశెంబరు 2022 (13:53 IST)

అటెండర్ టిఫిన్ తీసుకొచ్చేలోపు ఆత్మహత్య చేసుకున్న తాహసీల్దారు

hang
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరావు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని పెదబయలు మండల తాహసీల్దారు ఆత్మహత్య చేసుకున్నాడు. అటెండర్ టిఫిన్ తీసుకొచ్చేలోపు తన కార్యాలయంలోనే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. 
 
గురువారం జరిగిన ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే, పెదబయలు మండల తాహసీల్దారుగా శ్రీనివాస రావు పని చేస్తున్నారు. ఈయన గురువారం ఉదయం ఎప్పటిలాగానే విధులకు వెళ్లారు. ఆ తర్వాత అటెండర్‌ను పిలిచి టిఫిన్ తీసుకుని రావాలని చెప్పడంతో అటెండర్ బయటకు వెళ్లి టిఫిన్ తెచ్చేలోపు శ్రీనివాస రావు కనిపించలేదు. 
 
దీంతో ఆ ప్రాంతమంతా గాలించగా, పక్కనే ఉన్న ఒక షెడ్డులో ఆయన ఉరి వేసుకుని ఉండటాన్ని గమనించాడు. వెంటనే ఇతర అధికారులకు, సిబ్బందికి, పోలీసులకు సమాచారం చేరవేశాడు. వారంతా వచ్చి చూడగా అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్టు నిర్దారించారు. దీంతో మండల కేంద్రంలో విషాదం నెలకొంది. 
 
ఆయన ఆత్మహత్యకు కారణాలు తెలియకపోయినప్పటికీ ఇటీవల ఆయన జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన ఒక సమీక్షకు వెళ్లారు. ఈ సందర్భంగా భూముల సర్వే విషయంలో ఆయనపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన ఈ విషాదకర నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.