మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 సెప్టెంబరు 2022 (10:54 IST)

హైదరాబాద్ ఐఐటీలో మంచానికి ఉరేసుకున్న విద్యార్థి

suicide
హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ హెచ్)లో ఎంటెక్ విద్యాభ్యాసం చేస్తున్న రాహుల్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తాను ఉండే హాస్టల్ గదిలోనే మంచానికి ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అయితే, తల్లిదండ్రులు రాకముందే అధికారులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. దీంతో రాహుల్ తండ్రి తన కుమారుడు ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. 
 
హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన రంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ విద్యా సంస్థ ఉంది. ఇక్కడ ఏపీలోని నంద్యాల జిల్లాకు చెందిన రాహుల్ అనే విద్యార్థి ఎంటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం తెల్లవారేసరికి తాను ఉంటున్న హాస్టల్ గదిలోనే మంచానికి ఉరేసుకుని కిందపడుకునివున్న స్థితిలోనే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన తెలిసిన వెంటనే విద్యాలయ అధికారులు మృతుడి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండానే అతడి మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. 
 
తన కుమారుడు ఆత్మహత్య విషయం ఆలస్యంగా తెలుసుకున్న రాహుల్ తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్‌కు వచ్చారు. అయితే, అప్పటికే రాహుల్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి కావడం, మృతదేహాన్ని చూసేందుకు సైతం విద్యాలయ అధికారులు తల్లిదండ్రులకు అనుమతి ఇవ్వలేదు. అసలు ఎవరైనా మంచానికి ఉరేసుకుని చనిపోతారా అంటూ రాహుల్ తండ్రి సందేహం వ్యక్తం చేస్తున్నాడు. తన కుమారుడు మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని ఆయన ఆరోపిస్తున్నారు.