శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 జూన్ 2020 (19:02 IST)

సీఎం కాన్వాయ్‌కు ఫైన్ - 8 నుంచి హైదరాబాద్ సిటీ సర్వీసులకు రైట్ రైట్...

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్‌కు హైదరాబాద్ నగర పోలీసులు అపరాధం విధించారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినందుకుగాను సీఎం కాన్వాయ్‌లోని ఓ వాహనానికి ఫైన్ వేశారు. 
 
హైదరాబాద్, సైబరాబాద్, సూర్యాపేటలలో కేసీఆర్ కాన్వాయ్ వాహనం పరిమితికి మించి వేగంగా వెళ్లినందుకుగాను ట్రాఫిక్ పోలీసులు నాలుగు సార్లు జరిమానా విధించారు. మొత్తం రూ.4,140 చలాన్లు పంపారు. తాజాగా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు పెండింగులో ఉన్న ఈ చలాన్లను చెల్లించారు.
 
మరోవైపు, దాదాపు రెండున్నర నెలలుగా డిపోలకే పరిమితమైన హైదరాబాద్ సిటీ బస్సులు మరో ఐదు రోజులలో రోడ్డెక్కనున్నాయి. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా సిటీ, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు కేంద్రం అనుమతినిచ్చిన నేపథ్యంలో సిటీ బస్సులు నడపాలని టీఎస్ ఆర్టీసీ యోచిస్తోంది.
 
ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సడలింపుల్లో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు తెరుచుకున్నాయి. పారిశ్రామిక కార్యకలాపాలు మొదలయ్యాయి. అయితే, ప్రజా రవాణా సంస్థ అందుబాటులో లేకపోవడంతో సాధారణ ప్రజలతో పాటు... ఉద్యోగులు, ఇతర రంగాల వారుకూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 
 
కాగా, జంట నగరాల్లో రోజుకు దాదాపు 33 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తుంటారు. దాదాపు అన్ని కార్యకలాపాలు ప్రారంభమైనప్పటికీ బస్సులు లేకపోవడంతో వీరంతా అష్టకష్టాలు పడుతున్నారు. బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాల్సి వస్తోంది. అయినా అవేమీ అందుబాటులో లేకపోలేదు. 
 
మరోవైపు, షేర్ ఆటోలున్నా కరోనా భయంతో వాటిపై ఎవరూ పెద్దగా అటువైపు ఆసక్తి చూపడం లేదు. సొంతవాహనాలు ఉన్న వారు వాటిపైనే కార్యాలయాలకు వెళ్తుండడంతో నగరంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ నెల 8 నుంచి సిటీ బస్సులు నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.