ఆంధ్రాకు వెళ్లాలనుకునేవారికి శుభవార్త : తెలంగాణ డీజీపీ
తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళదలచుకున్న వారికి ఎలాంటి పాస్‌లు అక్కర్లేదని తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే, తెలంగాణ నుంచి కర్ణాటక, మహారాష్ట్రకు వెళ్లేవారు ఆయా రాష్ట్రాల రిజిస్ట్రేషన్ యాప్‌లలో ప్రయాణ వివరాలు నమోదు చేసుకోవాలని సూచన చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లదలచిన వారు మాత్రం స్పందన యాప్‌లో, కర్ణాటక వెళ్లేవారు సేవా యాప్‌లో, మహారాష్ట్ర వెళ్లే వారు ఆ రాష్ట్ర పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని డీజీపీ కార్యాలయం సూచించింది. తెలంగాణకు వచ్చే వాహనాలకు కూడా పాసులు అడగడం లేదని గుర్తుచేసింది.
మరోవైపు, అంతర్రాష్ట్ర ప్రయాణికుల రాకపోకలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలను కొనసాగిస్తోంది. తదుపరి ఉత్తర్వులు వెలువడంత వరకు ఈ పరిస్థిత కొనసాగుతుందని ఇటీవలే ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపిన విషయం తెల్సిందే. ఇతర రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గాన ఆంధ్రప్రదేశ్ రావాలనుకునే ప్రయాణికులు ఖచ్చితంగా స్పందన పోర్టల్ ద్వారా ఈ-పాస్ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
కరోనా ప్రభావం తక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారు మాత్రం 7 రోజులు ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్‌లో ఉండి టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. పాజిటివ్ వస్తే కోవిడ్ ఆస్పత్రికి.. నెగిటివ్ వస్తే 7 రోజులు హోం క్వారంటైన్‌కు వెళ్లాల్సిన అవసరం ఉందని డీజీపీ పేర్కొన్నారు.